Fee Reimbursement: రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలన నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. హైకోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు బీజేపీ చేపట్టిన నిరంతర ఆందోళనలు, నిరసన కార్యక్రమాల వల్లే ఈ విద్యాసంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థులకు నామమాత్రంగా అయినా నిధులు మంజూరయ్యాయని, అయితే దాదాపు రూ.15,000 కోట్ల పాత బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందక వారి భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజులు రాకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజనీరింగ్, ఫార్మసీ లెక్చరర్లు, ప్రొఫెసర్లకు పూర్తి జీతాలు ఇవ్వలేక సగం జీతాలతోనే నడిపిస్తున్నాయని, దీనివల్ల రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విద్యా వ్యవస్థను ఇలా నిర్వీర్యం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కాపాడేందుకు ఫీజు బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తగిన సలహాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకునేలా సలహా ఇస్తానని హామీ ఇచ్చారని రాంచందర్ రావు వెల్లడించారు.
Also read: ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !
అదేవిధంగా శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలే కారణమని, అందుకే ఆ రెండు పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగకుండా ప్రజలకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడం మాని, జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీఛార్జీలు, ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు బనాయిస్తూ దున్నపోతుపై వాన పడినట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. నిన్నటి ఆందోళనలో పోలీసుల దాడి వల్ల తీవ్రంగా గాయపడి పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం కొన్ని రోజులు వేచి చూస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
Also read: మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్