Rapthadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తరగతి గదిలోనే రంపంతో బాలికపై ఉన్మాది విరుచుకుపడిన ఈ ఘటన పట్ల ప్రజలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు కీలక పురోగతి సాధించారు.
పోలీసుల అదుపులో నిందితుడు
ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దాడి అనంతరం ధర్మవరం వైపు పారిపోతున్న సమయంలో అతడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని ధర్మవరం మండలానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం సదరు యువకుడు బాధిత బాలికకు సమీప బంధువేనని సమాచారం. ప్రస్తుతం అతడిని సీక్రెట్ లొకేషన్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోరెన్సిక్ బృందం తనిఖీలు.. దాడి సాధనం స్వాధీనం
మరోవైపు, ఘటన జరిగిన పాఠశాలలోని పదో తరగతి గదిని ఫోరెన్సిక్ నిపుణుల బృందం అంగుళం అంగుళం పరిశీలించింది. దాడికి సంబంధించిన కీలక ఆధారాలు, రక్త నమూనాలను సేకరించారు. ఘటనా స్థలంలో నిందితుడు దాడి కోసం ఉపయోగించిన రంపం మెషీన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స
ఈ దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలోనే విద్యార్థినిపై ఇలాంటి భయానక దాడి జరగడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: క్లాస్‌రూమ్‌లో దారుణం.. 6 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడి రాక్షస దాడి.. షాకింగ్ CCTV విజువల్స్!