YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా తన కుమార్తె అంజిలి వివాహ వేదిక మార్పునకు సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక ప్రకటన చేశారు. యలహంకలోని ప్రాపర్టీ అంశంపై, కుమార్తె పెళ్లి వేదిక మార్పు వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకొకరి దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని షర్మిల అన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం హక్కులు తనకు, తన పిల్లలకు సంక్రమించాయని షర్మిల స్పష్టం చేశారు. ఇది దేవుడి సాక్షిగా నిజమని పేర్కొన్నా. ‘అది నా పిల్లల చట్టబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా స్వర్గీయ నాన్న వైఎస్సార్ గారు తిరిగిన ఇల్లు’ అని స్పష్టం చేశారు.
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
— YS Sharmila (@realyssharmila) October 31, 2026
తెలుగువారి సంప్రదాయంలో సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ఏ తల్లిదండ్రులకైనా ఒక పెద్ద అదృష్టమని షర్మిల పేర్కొన్నారు. ‘తాను పెరిగిన యలహంక ఇంట్లోనే తన వివాహం జరగాలని నా కుమార్తె అంజిలి కోరుకుంది. అయితే అక్కడ వివాహం జరిపించలేకపోతున్నామని, బిడ్డ ఆశను నెరవేర్చలేకపోయామనే బాధ నన్ను ఎంతగానో తొలిచేస్తోంది. వివాహ వేదిక విషయమై జరుగుతున్న పరిణామాలను చూసి నా బిడ్డ కోసం బాధపడిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: లండన్ నుంచి సీక్రెట్‌గా వచ్చి.. అపార్ట్ మెంట్‌లో శవమైన యువతి.. విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు!
తన కూతురిది పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా తమపై ఉందని షర్మిల తెలిపారు. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకున్నట్లు ప్రకటించారు. కాబోయే నవదంపతులపై తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.