Rapthadu School Attack: పాఠశాల అంటే విద్యార్థులకు దేవాలయంతో సమానం. కానీ, అదే బడి తరగతి గదిలో ఒక అమాయకపు బాలికపై జరిగిన అమానుష దాడి యావత్ రాష్ట్రానికే దిగ్భ్రాంతి కలిగించింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై ఓ ఉన్మాది రంపంతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘాతుకంలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న చెల్లిని రక్షించేందుకు తోటి విద్యార్థిని ధైర్యంగా అడ్డు వెళ్లడంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. దాడి అనంతరం పాఠశాలలో తీవ్ర భయాందోళనలు నెలకొనగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మండిపడ్డ సీఎం చంద్రబాబు..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ఆమెకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకున్న సీఎం, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సమాజంలో ఇటువంటి అకృత్యాలకు పాల్పడే నిందితులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కన్నీళ్లు ఆగలేదు..: మంత్రి లోకేష్
విద్యార్థినిపై జరిగిన దాడిని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ‘చిన్నారి చెల్లిని క్లాస్ రూమ్‌లోనే నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు, గుండె బరువెక్కింది’ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఉన్మాదులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని, ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లల భద్రత పట్ల అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా వదిలేదే లేదని స్పష్టం చేశారు.
మెరుగైన వైద్యానికి హోం మంత్రి అనిత ఆదేశం
ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించారు. అనంతపురం జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాలికకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసి వెంటనే పట్టుకోవాలని హోం మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: సీజ్ చేసిన ఫోన్‌తో రూ.1.70 లక్షలు బదిలీ.. 12 తులాల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్