RGV Sensational Comments: తన గురించి ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ కు వచ్చి హల్చల్ చేయడంతో ఎట్టకేలకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తనపై నమోదైన కేసులపై స్పందించిన రాంగోపాల్ వర్మ.. పలు సంచలన కామెంట్స్ చేశారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా విడుదల సంధర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ఆర్జీవీ పోస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులకు టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నేరుగా హైదరాబాద్ కు వచ్చి రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు తనకు గడువు కావాలని ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. మళ్లీ మరోమారు ప్రకాశం పోలీసులు, నోటీసులు అందించారు ఆర్జీవీకి. ఆ నోటీసులు స్వీకరించిన ఆర్జీవీ మళ్లీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ దశలో ప్రకాశం పోలీసులు భారీగా ఆర్జీవీ ఇంటి వద్దకు చేరుకొని సర్చ్ వారెంట్ లేకపోవడంతో అక్కడే ఆయన కోసం పడిగాపులు కాశారు. ఈ దశలో ఆర్జీవీ షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసు నమోదైన సమయం నుండి ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు రెండు దఫాలుగా నోటీసులను రాంగోపాల్ వర్మకు అందించారు. ఒకానొక దశలో రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేశాయి. అయితే తాజాగా తనపై నమోదైన కేసుల గురించి రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానమిచ్చినట్లు తెలిపారు. తాను కేసులకు భయపడి ఏడుస్తున్నట్లు, వణుకుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అలాగే తాను ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్ వల్ల అసలు వ్యక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా, ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తనపై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ ఆర్జీవి స్పందించారు.
తనపై కేసు నమోదు చేస్తూ.. పోలీసులు పెట్టిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అనుమానాలు తనకు ఉన్నాయని, అయితే తాను పోలీసులను, అధికారులను నిందించడం లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద తనపై నమోదైన కేసుల గురించి ఆర్జీవి స్పందించగా, పోలీసుల రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ లలో ఉన్నట్లు ఆర్జీవీ చివరిగా ప్రకటించారు.