RK Roja Comments: మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామంటూ మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. రోజా కామెంట్స్ ను బట్టి జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వని పక్షంలో, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో ప్రజల మధ్యలో తేల్చుకుంటామంటూ రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తొలిరోజు గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలో, వైసీపీ సభ్యులు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే గవర్నర్ ప్రసంగం ప్రతులను సైతం చించి వేశారు. అనంతరం అసెంబ్లీ నుండి వాకౌట్ చేసినట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై మాజీ మంత్రి రోజా మీడియా సమావేశాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు.
రోజా మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనను తలపించే రీతిలో ఏపీలో కూటమి పాలన సాగుతుందన్నారు. అసెంబ్లీకి కూటమి ప్రభుత్వానికి భజన చేసే మీడియాను అనుమతించారని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ రోజా విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలు పాలు చేసేందుకు కూడా టీడీపీ నేతలు వెనుకాడడం లేదని, ఇలాంటి దారుణాలు ఎక్కువ రోజులు సాగవంటూ రోజా అన్నారు. గవర్నర్ తో అన్ని అబద్ధాలే చెప్పించారని, గవర్నర్ ప్రసంగంలో వాస్తవం లేదన్నారు.
ప్రజలను ఎలా మభ్యపెట్టాలో పూర్తిగా ప్రణాళికలు రూపొందించుకొని ఎన్నికల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, అధికారాన్ని చేజిక్కించుకున్న అనంతరం ప్రజలను అట్టే మోసం చేస్తున్నట్లు రోజా విమర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థులు కూటమికి ఓట్లు వేసినందుకు చెప్పులతో కొట్టుకుంటూ నిరసన తెలిపినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. మంత్రి నారా లోకేష్ కూలింగ్ గ్లాసులు ధరించి దుబాయ్ లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారని, విద్యార్థుల గోడును మాత్రం పట్టించుకోలేదన్నారు.
దమ్ము ధైర్యం ఉంటే మాజీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు సాగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. 9 నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారని, కానీ సూపర్ సిక్స్ పథకాలను మాత్రం అమలు చేయలేదంటూ రోజా అన్నారు. ముసలి వాళ్లు బటన్ నొక్కుతారంటూ గతంలో టీడీపీ నేతలు కామెంట్స్ చేశారని, మరి అదే బటన్ ప్రస్తుతం చంద్రబాబు ఎందుకు నొక్కలేక పోతున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
Also Read: అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి జగన్ వచ్చారా?
పవన్.. నీతులు చెప్పొద్దు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం జగన్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై రోజా ఫైర్ అయ్యారు. హుందాతనం గురించి పవన్ మాట్లాడడం కామెడీగా ఉందని, ఏ రోజుకు ఆ రోజు అవతారాలు మారుస్తూ పవన్ ప్రజలను ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలకు, ప్రజలకు పవన్ ఏం చేశారో చెప్పాలని, ఒకసారి ఎన్నికల ముందు చేసిన ప్రసంగాలను పవన్ వినాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ మీద ఉన్న గౌరవంతో జగన్ అసెంబ్లీకి వచ్చారని, పవన్ చేత నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో వైసీపీ లేదన్నారు. జగన్ బ్లడ్ లో భయం లేదని, సోనియాగాంధీ, చంద్రబాబు ను పవన్ అడిగితే ఆ మాట తెలుస్తుందంటూ రోజా కామెంట్స్ చేశారు.