జగన్ పర్యటన అంటే వైసీపీ నేతలు జన సమీకరణకు పోటీ పడుతున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టడంతో వాటిని అతిక్రమించి మరీ తమ ప్రతాపం చూపించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో కూడా అదే జరిగింది. పరిమితికి మించి జనం రాకూడదని, వాహనాలు వద్దని, ర్యాలీ వద్దని పోలీసులు సూచించినా.. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ ఆ ఆంక్షల్ని అతిక్రమించిందనే విమర్శలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో జనం మధ్య నలిగిపోయి నాయకులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. జగన్ కూడా అతీతుడేం కాదు. కరచాలనం చేయడానికి వచ్చిన జనంతో ఆయన బాగా ఇబ్బంది పడ్డారు. జగన్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నాయి.
ఒరేయ్
కామెడీ పీస్ ని చేశారుగా 🤣🤣#Tillutrolls pic.twitter.com/0XyHoycv9x
— Tillu Trolls (@tillutrolls) July 9, 2025
రోజా కూడా..
మాజీ మంత్రి రోజాను చూసేందుకు కూడా జనం పెద్ద సంఖ్యలో గుమికూడారు. అటు ఇటు అభిమానులు వరుసలో నిలబడగా ఆమె అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఆ తర్వాత జగన్ రావడంతో అసలు తోపులాట మొదలైంది. అటు జగన్ ని కూడా చుట్టుముట్టేశారు. ఆయనతో కరచాలనానికి పోటీ పడ్డారు. జగన్ వద్దకు వెళ్లేందుకు నేతలు ప్రయత్నించడంతో వారిని కూడా తోసేశారు. రోజాతోపాటు పెద్దిరెడ్డి కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ జనం నుంచి తప్పించుకుని రావడం వారికి అసాధ్యంగా మారింది. చివరకు మెల్ల మెల్లగా ఒక్కొకరూ పక్కకు తప్పుకోవడంతో జనం మధ్యలోనుంచి రోజా, పెద్దిరెడ్డి మరోవైపుకి వచ్చారు.
తప్పెవరిది..?
పోలీసులు రోప్ పార్టీని పెడితే జనాల్ని అడ్డుకోవడానికి అంటూ గొడవ చేస్తున్నారు వైసీపీ నేతలు. సెక్యూరిటీ పరిమితంగా ఉంచితే, జగన్ ని పట్టించుకోవడం లేదని కోర్టుకెళ్తున్నారు. జన సమీకరణ వద్దని, బల ప్రదర్శన పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులు సూచించినా నేతలు పట్టించుకోవడం లేదు. ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ జనాల్ని బంగారుపాళ్యంకు తరలించారు. పొలాలు, ఇతర ప్రాంతాలనుంచి జనం బైక్ లపై వచ్చేవన్నీ ఆ డ్రామాలో భాగమేనంటూ టీడీపీ విమర్శిస్తోంది. జగన్ రాష్ట్రంలో ఎక్కడ యాత్ర చేపట్టినా కొంతమంది కచ్చితంగా అక్కడకు వస్తున్నారని, వారే హడావిడి చేస్తున్నారని, వైసీపీ కూడా వారితోనే నాటకం రక్తి కట్టిస్తోందని చెబుతున్నారు. టీిడీపీ ఆరోపణలు ఎలా ఉన్నా.. వైసీపీ అభిమానులతో వైసీపీ నేతలే ఇబ్బంది పడటం ఇక్కడ కొసమెరుపు.
బ్యానర్లు లేవు..
సత్తెనపల్లిలో రప్పా రప్పా బ్యానర్లు పోలీస్ కేసులకు దారి తీయడంతో బంగారుపాళ్యంలో మాత్రం నేతలెవరూ ఆ సాహసం చేయలేదు. జన సమీకరణకోసం ప్రయత్నించారు కానీ చిత్ర విచిత్రమైన కొటేషన్లతో బ్యానర్లు ప్రదర్శించి ఇబ్బంది పడటం ఎందుకని అనుకున్నారు. అందుకే బ్యానర్లు, స్లోగన్లు లేకుండానే జగన్ టూర్ పూర్తయింది. వైసీపీ యువజన విభాగానికి చెందిన ఒక నాయకుడికి మాత్రం తల పగిలిందని చెబుతున్నారు. దీనికి కారణం పోలీసులు లాఠీచార్జ్ అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. ఆ దాడి ఘటనను హైలైట్ చేస్తూ జగన్ కూడా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ట్రాక్టర్లలో మామిడి పండ్లు తీసుకొచ్చి రోడ్లపై పారబోయడం, తొక్కించడం ఈ పర్యటనలో సంచలనంగా మారింది.