Earthquake In Delhi: ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు నేషనల్ కాపిటల్ రీజియన్ ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. గురువారం ఉదయం 9 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఉన్నట్లుండి సడన్‌గా భూమి వణకడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.4గా నమోదైంది.
గురువారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రజలు ఆఫీసులకు వెళ్లేందుకు ఇంటి నుంచి రెడీ అవుతున్నారు. ఒక్కసారిగా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థంకాక బెంబేలెత్తారు. వీటివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం మేరకు హర్యానాలోని రోహ్‌తక్‌లో 4.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. హర్యానాలోని ఝజ్జర్‌కు ఈశాన్యం మూడు కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు గుర్తించారు అధికారులు. పశ్చిమ ఢిల్లీకి కేవలం 51 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కేవలం ఢిల్లీ కాకుండా అటు రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో భూమి కంపించినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట జపాన్ చుట్టు దీవుల్లో ఆ తరహా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ఫలకాల కదలికలు చురుగ్గా ఉన్నట్లు అక్కడి అధికారులు చెప్పారు. దాని తర్వాత చిన్నచిన్నవి ఆ దేశంలో పట్టాయి. అది జరిగి వారం రోజులకు ఉత్తర భారతాన్ని భూప్రకంపనలు వణికించాయి.
ALSO READ: గ్రేట్ కుక్క.. క్షణాల్లో 63 మంది ప్రాణాలను
గతంతో పోలిస్తే ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు స్థానికులు. భూమి కంపించడంతో చాలా చోట్ల ప్రజలు, ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. పరిస్థితి గమనించిన ఎన్డీఆర్‌ఎఫ్.. అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని సూచనలు చేసింది. ఇలాంటి సమయాల్లో లిఫ్ట్ ఉపయోగించకూడదని, మెట్లు నుంచి కిందకు రావాలని పేర్కొంది.
మరోవైపు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానకు హస్తిన అతలాకుతలమైంది. భారీ వర్షాల వల్ల ఉదయం పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎగువ ప్రాంతాల నుంచి రోడ్లపైకి నీటి రావడంతో రహదారులు నిండిపోయాయి. తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న వాహనదారులు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీని ప్రభావం విమాన రాకపోకలపై అంతరాయం కలిగింది. నేడు, రేపు భారీగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.