
YSRCP latest news(Andhra Pradesh political news today) :
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ- వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతల విమర్శలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని సజ్జల ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని వివరించారు. దోచుకోవడానికే ఈ స్కీమ్ పెట్టారని మండిపడ్డారు. షెల్ కంపెనీల ద్వారా నగదుగా మార్చుకున్నారని ఆరోపించారు. పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిందని సజ్జల వివరించారు.
2019 ఏప్రిల్‌లోనే సీమెన్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిందని సజ్జల తెలిపారు. సీమెన్స్ ప్రతినిధులు తమకు సంబంధం లేదని చెబుతున్నారన్నారు. ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని అంటున్నారని చెప్పారు. అసలు తమకు డబ్బు రాలేదని సీమెన్స్ సంస్థ అంటోందన్నారు. డబ్బు టెక్‌డిజైన్‌కు వెళ్లిందని అక్కడి నుంచి షెల్ కంపెనీలకు వెళ్లిందని ఆరోపించారు. ఈడీ హవాలా వ్యవహారంపై దర్యాప్తు చేసిందన్నారు.
2014 సెప్టెంబర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని సజ్జల వివరించారు. గంటా సుబ్బారావు ఎండీని చేశారని గుర్తు చేశారు. 2015లో పేరును స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చారని తెలిపారు. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు స్కిల్ స్కామ్ కేసు కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని సజ్జల అన్నారు.
చంద్రబాబు జైల్లో ఉండటమే తప్పైనట్లు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. బాబును హింసిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దొంగల్ని పట్టుకుంటే ఎందుకంత హడావిడి చేస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ, ఎల్లో మీడియా హడావిడి చేస్తున్నాయన్నారు.
కోర్టే రిమాండ్ విధించిన తర్వాత ఈ హడావిడి ఎందుకు? అని సజ్జల ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు అయిపోవన్నారు. చట్టాలకు చంద్రబాబు అతీతుడా? అని నిలదీశారు. సానుభూతి, రాజకీయ ప్రయోజననాల కోసమే బాబు పాకులాడుతున్నారని విమర్శలు చేశారు. యువత పేరు చెప్పి చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. దొంగను అరెస్ట్ చేస్తే మానవహక్కుల ఉల్లంఘన? అవుతుందా అని ప్రశ్నించారు. జైలులో ఎవరికీ కల్పించని సౌకర్యాలు చంద్రబాబుకు కల్పించారని సజ్జల స్పష్టం చేశారు.