Vijayawada: వైసీపీకి ఇంటిపోరు ఇప్పుడిప్పుడే మొదలైందా? కీలక నేతల మధ్య మాటల యుద్ధం ముదిరిందా? విజయసాయిరెడ్డి-సజ్జల మధ్య ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం ఇదే తొలిసారి. వీరి మధ్య మాటలు తూటాలు రానున్న రోజుల్లో పేలే అవకాశముందా? ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో? ఇంతకీ సజ్జల రామకృష్టారెడ్డి ఏ విధంగా కౌంటరిచ్చారో ఇప్పుడు చూద్దాం.
విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు విప్పారు. ఆదివారం మీడియా ముందుకొచ్చిన సజ్జల, వీఎస్ఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిని అధినేత జగన్ ఎక్కువగా అభిమానించారని, సొంత పార్టీ పెట్టుకోవడం కోసం విమర్శించడం ఎందుకని ప్రశ్నించారు. విజయసాయి సొంతంగా రాజకీయాలు చేసుకోవచ్చని, మమ్మల్ని టార్గెట్ చేస్తే రియాక్షన్ గట్టిగా ఉంటుందన్నారు.
నాపై కేసులు పెట్టడానికి అప్పట్లో రాజకీయాల్లో లేనని కుండబద్దలు కొట్టేశారు. 2024 తర్వాత తప్పుడు కేసుల్లో అంతా అరెస్ట్ అయ్యారని, కానీ విజయసాయిరెడ్డి ఎలా తప్పించుకోగలిగారని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ఆయన చేసిన ఆరోపణలను ఇకపై పట్టించుకోనన్న సజ్జల, పార్టీ నేతలు కూడా పట్టించుకోవద్దన్నారు.
విజయసాయి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, ఇదంతా పబ్లిసటీ కోసం ప్రయత్నాలని ఎద్దేవా చేశారు. సొంత కారణాలతో విజయసాయి వైసీపీని వీడారని అన్నారు సజ్జల. ఆయన పార్టీని ఎందుకు విడిచి పెట్టారో తెలియదని, తాను వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పార్టీ నుంచి వెళ్లిపోయినవారి గురించి జగన్ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. జగన్, వైసీపీపై విమర్శలు చేయడానికి పాత్రలు మాత్రమే మారుతున్నాయని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా జగన్ వెంట ఉన్న వ్యక్తి, ఆయన నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఈ విధంగా మాట్లాడడం సరైన పద్దతి కాదన్నారు.
ALSO READ: షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?
వైసీపీ అంటే కోటరీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. వీఎస్ఆర్ ఆరోపణల వల్ల పార్టీలో అపోహలు ఏర్పడే అవకాశం ఉన్నందన్నారు. వాటిని తొలగించేందుకే తాను వివరణ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీలో విజయసాయికి నంబర్-2 స్థానం కల్పించారని, ఆయనకు వచ్చిన పదవులు పార్టీలో ఎవరికీ రాలేదన్నారు. ఇప్పుడు జగన్ నంబర్-2, సజ్జల నంబర్-1 అని చెప్పడం సరికాదన్నారు. వైసీపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనేనని తేల్చేశారు. జగన్ ఒక్కరే నేత అని, మిగతా వారంతా కార్యకర్తలేనన్నారు.