
AP Assembly Live Updates(Andhra news today): రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం చర్చించనున్నారు. నాలుగు రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో రేపు ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది సర్కార్. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పద్దులపై చర్చ జరగనుంది.
నిన్న తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నజీర్ తన ప్రసంగాన్ని వినిపించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ.. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక అసెంబ్లీ ముగిసిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఈ నెల 8 వరకు సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఓటాన్ బడ్జెట్‌పై కూడా చర్చ జరిగింది.
ఏపీలో ఎన్నికల వేడి కాకరేపుతున్న వేళ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి ప్రజల్లో జగన్ సర్కార్‌పై వ్యతిరేకతను పెంచే పనిలో ఉన్న టీడీపీ అందుకు తగ్గట్టుగా సభలో తన వాదనను బలంగా వినిపించేందుకు సమాయత్తమవుతోంది. మరోపక్క ప్రతిపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ఇటు అధికార పార్టీ నేతలు కూడా సిద్ధమవడంతో ఈసారి కూడా శాసనసభా సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశముంది.