శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక నేతగా వ్యవహరించారు. జగన్ వద్ద అత్యధిక మార్కులు గల నేతగా సీతారాంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో సీతారాం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉండడంతో, ఏదో ఒక పార్టీలోకి జంపు కావడం ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు ఇక రేపో మాపో జనసేనలోకి వెళ్లడం ఖాయమని, ప్రచారం సైతం సాగింది.
ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో చేరుతున్న నేపథ్యంలో వైసిపి క్యాడర్ ను కాపాడుకునే పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. తాజాగా తమ్మినేని సీతారాం సైతం జనసేన పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై వైసీపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం తమ్మినేని సీతారాం ను కలవడం విశేషం. పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో బొత్స కలిశారా.. లేక సాధారణంగానే భేటీ జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే ఆదివారం సాయంత్రం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. జనసేనలో చేరుతానన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం తగదన్నారు. తన కుమారుడిని వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించానని, 15 రోజులుగా వైద్యశాల వద్ద ఉన్నట్లు తమ్మినేని అన్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు, తనకు జనసేనలో చేరాల్సిన అవసరం ఏమి వచ్చిందని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. మాజీమంత్రి బొత్స భేటీ అనంతరం తమ్మినేని ఈ కామెంట్స్ చేయడం విశేషం.