Cyclone Akwan: అక్వాన్ తుఫాన్ ఎప్పుడు ఏ విధంగా టర్న్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకున్నాయి. తొలుత ఏపీ టార్గెట్ కాగా, ఇప్పుడు ఒడిషా వంతైంది. ఒక విధంగా చెప్పాలంటే ఏపీకి అక్వాన్ తుపాను ముప్పు తప్పింది. కాకపోతే ఆరు జిల్లాలకు వాన గండం ముప్పు పొంచివుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ అక్వాన్ ఇప్పుడు ఒడిషా వైపు టర్న్ అయ్యింది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ. వేగంతో మెల్లగా కదులుతోంది. ఎప్పుడైనా దిశ మార్చుకుని టర్న్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి నరసాపురానికి 470 కి.మీ, కళింగపట్నంకి 490 కి.మీ, చెన్నైకి 570 కి.మీ, గోపాల్‌పూర్‌కి 580 కి.మీ, పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
ఇప్పుడు కదులుతున్నట్లు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ ఒడిశా వైపు వెళ్తున్నప్పటికీ కోల్‌కతా- బంగ్లాదేశ్ తీరానికి చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై పడింది. గురువారం నుంచి శనివారం వరకు అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గురువారం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ALSO READ: భార్యకు సర్పంచ్‌గా అవకాశం దక్కలేదని భర్త ఆత్మహత్య!
శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మొత్తానికి అక్వాన్ దిశ మార్చుకుని ఏపీకి రక్షించింది.