Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తీవ్ర ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్యారంగాన్ని గాలికొదిలేశారని, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
ఫీజు బకాయిలపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో పేద విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. జగన్ హయాంలో 18 క్వార్టర్లకు విద్యా దీవెన, వసతి దీవెన నిధులు సక్రమంగా చెల్లించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు పైగా ఖజానాలో ఉంచి వెళ్లినా.. నేడు ప్రభుత్వం రూ.9,100 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు నగలు తాకట్టు పెట్టి అప్పులుపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులు, పోలీసులు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నాని ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల్లో వైసీపీ అభ్యర్థులను అడ్డుకుని దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు తెరలేపిందని అన్నారు. అల్లూరి జిల్లా పరిషత్‌ను వైసీపీ గెలుచుకున్నప్పటికీ, సభ్యులను కొనుగోలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. గూండాలు, దౌర్జన్యాలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు కొత్త కాదని, గతంలోనూ ఇలాంటి చర్యల వల్లే ఆయన పతనమయ్యారని గుర్తుచేశారు.
డైవర్షన్ రాజకీయాలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను ప్రశ్నిస్తుంటే.. ప్రభుత్వం బాబాయ్ హత్య కేసుల పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టెలీ కాన్ఫరెన్సుల ద్వారా పార్టీ శ్రేణులకు అక్రమాలు నేర్పుతున్నారని, కుటుంబ బంధాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన ఘాటుగా విమర్శించారు.
Also Read: రాముడిపై జావీద్ అఖ్తర్ సంచలన కామెంట్స్.. రగిలిపోతున్న ముస్లిం సంఘాలు!