Baby Anagha: ఆడుకోవాల్సిన వయసులోనే అద్భుతమైన ఏకాగ్రత.. బోసి నవ్వుల వయసులోనే అసాధారణ గుర్తింపు.. ఆరు నెలల పసిప్రాయంలోనే ప్రపంచ రికార్డు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది అనఘ.
ఆడుకునే వయసులోనే రికార్డు బద్దలు..
సాధారణంగా చిన్నారులకు పుస్తకాలు చదివి వినిపిస్తే కొద్దిసేపటికే అటూ ఇటూ చూస్తుంటారు. కానీ అనఘ మాత్రం అలా కాదు. పెద్దలు ఏం చెబితే.. అది పుస్తకమైనా.. అమ్మ మాటైనా సుదీర్ఘ సమయం పాటు ఎంతో ఆసక్తిగా, ఏకాగ్రతతో వింటూ తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ అసాధారణ ప్రవర్తనే ఆమెను ప్రపంచ రికార్డు దిశగా నడిపించింది. లాంగెస్ట్ సస్టెయిన్డ్ అటెన్షన్ టు ఎ రీడ్-అలౌడ్ బుక్ బై ఎ 6-మంత్-ఓల్డ్ ఇన్ఫంట్.. కేటగిరిలో రికార్డు సాధించింది. ‘ది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ.. కిడ్స్ అండ్ యంగ్ అచీవర్స్ విభాగంలో అనఘ ప్రతిభను అధికారికంగా గుర్తించింది.
ఆరు నెలల చిన్నారి వైపు ప్రపంచం చూపు
2026 నవంబర్ 17న సంస్థ వరల్డ్ రికార్డ్ బుక్ ను ఇష్యూ చేసింది. దీంతో పసి ప్రాయంలోనే అనఘ పేరు ప్రపంచ రికార్డుల జాబితాలో నమోదైంది. అనఘ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా వెల్లలూరు గ్రామానికి చెందిన ఇక్కుర్తి శ్యామ్, గాయత్రి దంపతులు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. విదేశాల్లో ఉంటున్నా.. తమ చిన్నారి సాధించిన అరుదైన ఘనతతో తెలుగు నేల ఖ్యాతిని మరోసారి చాటారు. కుటుంబ సభ్యుల్లోనే కాదు.. తెలుగు వారందరిలోనూ ఈ విజయం ఆనందాన్ని నింపుతోంది. ఈ బుజ్జాయి భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం!
Also Read: బిగ్ టీవీ ఎఫెక్ట్.. ఆదిలాబాద్ రిమ్స్‌కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు!