Fee Reimbursement: జగన్ గారూ.. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని మీకు ఆర్థిక సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి మధ్య తేడా తెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందని ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఏ త్రైమాసికంలో విడుదల చేశామన్నది వేరు.. ఆ నిధులు ఏ విద్యా సంవత్సరపు బకాయిలకు చెల్లించామన్నది వేరు. ఇది కూడా తెలుసుకోలేని జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిల కోసం సుమారు రూ.3,000 కోట్లు విడుదల చేశామని అసెంబ్లీలో చెప్పామని, ఆ మాటకే కట్టుబడి ఉన్నామని, ఏ త్రైమాసికంలో ఎంత మొత్తం విడుదల చేశామో పూర్తి వివరాలను జతచేసిన పట్టికలో స్పష్టంగా చూపించామని అన్నారు. బడ్జెట్ అంచనాలు, సవరించిన కేటాయింపులు, వాస్తవ చెల్లింపుల మధ్య తేడా ఉంటుంది. నిధుల విడుదలకు అనుగుణంగా బడ్జెట్లో సర్దుబాట్లు జరుగుతుంటాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు ఈ విషయాలు తెలియకపోవడం, తెలుసుకోకపోవడం విచారకరం అని అన్నారు.
మీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎప్పుడూ ఆలస్యంగానే విడుదలయ్యేవి. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలోపే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. మేం ఆ పరిస్థితిని మార్చామని, విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా నేరుగా కళాశాలలకే నిధులు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చామని, ప్రతి నెలా రూ.200–300 కోట్ల చొప్పున బకాయిలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం.పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వీలైనంత త్వరగా చెల్లించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జగన్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపండి. మీ రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవద్దని నారా లోకేష్ అన్నారు.
Also read: గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీ..భారత్‌లో ఆపిల్ మ్యాప్స్ బిగ్ అప్డేట్