AP News : అవును, వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. డ్యూయెట్స్ పాడుకున్నారు. సినిమాలకు, షాపింగ్ మాల్స్‌కు తిరిగారు. కొన్ని నెలలుగా ప్రేమ సాగరంలో మునిగి తేలారు. ఇంకెంత కాలం ఇలా? పెళ్లి చేసుకుంటే పోలా? అనుకున్నారు. ఇంట్లో చెప్పడానికి మొదట ధైర్యం సరిపోలేదు. కానీ, అంతలోనే అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసి.. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పేసిందది ఆ ప్రేమ జంట. మొదట్లో ఒప్పుకోలేదు. నచ్చజెప్పితే ఆ తర్వాత ఒప్పేసుకున్నారు. ఇంకేం ఆల్ హ్యాపీస్. కానీ, అంతలోనే తీరని విషాదం.
పెళ్లికి అంతా రెడీ..
కర్నూలు జిల్లా అదోని మండటం హనువాళు గ్రామానికి చెందిన రాజు (21).. హొళగుంద మండలం ఎండీ హళ్లికి చెందిన ఓ యువతి.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మే 16న ముహూర్తం. ముందు రోజు పూజలు చేసేందుకు పెళ్లికొడుకు రాజు స్థానికంగా ఉండే ఉరుకుంద క్షేత్రానికి వెళ్లాడు. అయితే, అక్కడ ఏం ఆలోచించాడో ఏమో.. అంతలోనే ఘోరం జరిగిపోయింది.
మతం Vs మతం
వధువు వేరే మతానికి చెందిన యువతి. తమ మత విధానంలోనే పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అబ్బాయి తరఫు వాళ్లు మాత్రం తమ ఆచారం ప్రకారమే పెళ్లి జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెళ్లికొడుకు రాజుకు ఆ మత సంప్రదాయంలో వివాహం చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అలా చేసుకోలేక.. వధువు తరఫు వాళ్లు ఒప్పుకోక.. మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం అతన్ని ముందుగా ఆదోని ఆసుపత్రికి, ఆ తర్వాత కర్నూలు హాస్పిటల్‌కు తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు.
ప్రేమకు లేని మతం పెళ్లికా?
ప్రేమకు లేని మతం.. పెళ్లి వరకూ వచ్చే సరికి ప్రాణాలు తీసిందంటూ స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రేమించేటప్పుడు అమ్మాయి మతం తెలీలేదా? పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? తీరా మర్నాడు పెళ్లి అనే సరికి.. ఆ మత విధానంలో చేసుకోవడం ఇష్టం లేక ఇలా ఆత్మహత్య చేసుకోవడం దారుణమైన విషయం అంటున్నారు. రాజు చావుతో.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.