Dead Body Parcel Case: పార్సిల్‌గా వచ్చిన డెడ్ బాడీ ఇప్పుడు ఖాకీలను ఇంకా కలవరపెడుతున్న ప్రశ్న. అసలు ఆ డెడ్‌బాడీ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? ఎందుకు పంపారు? దీనికి సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్సిల్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్ అలియాస్ సుధీర్ ను పోలీసులు పట్టుకున్నారు. సుధీర్ తో పాటు అతనికి సహకరించిన ఓ మహిళను కూడా అదుపులోకి తీసున్నారు. దీంతో కేసులో అసలు దర్యాప్తు ఇప్పుడు మొదలు కానుంది. అయితే ఆ డెడ్ బాడీ వ్యక్తిని సుధీర్ ఎందుకు చంపాడు? మృతదేహాన్ని తన వదిన ఇంటికి ఎందుకు పార్సిల్ చేశాడనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నాడు కాబట్టి ఇవాళో రేపో దర్యాప్తు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
అయితే చనిపోయిన వ్యక్తి కూలీగా పనిచేసే పర్లయ్యగా తెలుస్తోంది. పర్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వారి మధ్య విభేధాల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. గతంలో లారీ డ్రైవర్ గా పనిచేసిన పర్లయ్య.. ఆ తర్వాత బతుకుదెరువుకోసం కూలీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పని కోసం పర్లయ్యను శ్రీధర్ తీసుకువెళ్లి హతమార్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పర్లయ్యనే ఎందుకు చంపాల్సి వచ్చిందేనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఇక.. ఆ డెడ్ బాడీని తులసీ ఇంటికే ఎందుకు పార్శిల్ చేశాడనే విషయంలో పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తులసితో శ్రీధర్‌వర్మకి ఆస్తి గొడవలు ఉన్నాయని గుర్తించారు పోలీసులు. అందులో భాగంగానే డెడ్ బాడీ పార్సిల్ చేసి డబ్బు ఇవ్వాలని ఓ లేఖ రాసినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి ఈ విషయంపై కూడా క్లారిటి రానుంది.
Also Read: డెడ్‌బాడీ హోం డెలివరీ కేసులో.. సంచలన విషయాలు
నిందితుడు అరెస్ట్ కావడానికి ముందే మరికొన్ని సంచలనాలను పోలీసులు గుర్తించారు. నిందితుడు సుధీర్‌వర్మ మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్టు తేల్చారు. ప్రస్తుతం మూడో భార్యతో కాళ్ల గ్రామంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో… బాక్సులో మృతదేహాన్ని పంపిన మహిళ శ్రీధర్ మూడో భార్య అయి ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.. మొత్తానికి సినిమా రేంజ్ ట్విస్టులతో నడుస్తున్న ఈ డెడ్ బాడీ పార్శిల్ కేసు ఆఖరు ఘట్టానికి చేరుకుంది. అయితే నిందితుడి పూర్తిగా విచారిస్తే అన్ని విషయాలపై క్లారిటీ రానున్నాయి.