అసలు వైసీపీ నేతలు అమరావతి పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడతారు కదా, అలాంటిది ఆపార్టీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ అమరావతికి విరాళం ఇస్తానని చెప్పడమేంటబ్బా అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ ఆయన నిజంగానే అమరావతి గురించి ప్రస్తావించారు. అయితే ఆయన పాజిటివ్ గా స్పందించలేదు, కాస్త వెటకారంగానే అమరావతి పేరు తెచ్చారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేసే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాకముందు తన కుటుంబానికి ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందన్నారు అనిల్. ఒక్క రూపాయి కూడా పెరగలేదని చెప్పారు. అలా పెరిగినట్టు నిరూపిస్తే, తనకు వేలకోట్ల రూపాయలు ఉన్నాయని రుజువు చేయగలిగితే వాటన్నిటినీ అమరావతికి విరాళంగా ఇస్తానన్నారు.
ఆయనతో నాకు మాటలే లేవు..
ఇటీవల నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా వ్యవహారంలో అనిల్ పేరు ప్రముఖంగా వినపడింది. క్వార్ట్జ్ ఎక్స్ పోర్ట్స్ వ్యవహారంలో మైనింగ్ యజమానుల వద్ద వసూళ్లు చేపట్టారని అనిల్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వసూళ్ల దందాకు నాయకత్వం వహించిన శ్రీకాంత్ రెడ్డి అనే వైసీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వాంగ్మూలంలో అనిల్ పేరు కూడా ఉందని.. అనిల్, కాకాణి కలసి ఈ దందా నిర్వహించారని వార్తలొచ్చాయి. దీనిపై అనిల్ స్పందించారు. అసలు కాకాణి గోవర్దన్ రెడ్డితో తనకు సఖ్యత లేదని, తమ మధ్య మనస్ఫర్థలు ఉండేవని చెప్పుకొచ్చారు అనిల్. అలాంటి కాకాణితో కలసి తాను వ్యాపారం చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. క్వార్ట్జ్ పై ఈడీ విచారణకు టీడీపీ నేతలు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. తానే ఈడీకి లేఖ రాస్తానన్నారు అనిల్.
జైలుకెళ్లడానికి రెడీ..
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు నెల్లూరులో ఏకంగా 2 వేల మంది పోలీసుల్ని పహారాగా పెట్టారన్నారు అనిల్. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టినా జనాన్ని మాత్రం ఆపలేకపోయారని చెప్పారు. ఇక నెల్లూరులో ఓ పథకం ప్రకారమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అక్రమ ఆస్తులున్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అనిల్. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఈనెల 4 న పోలీసు విచారణకు హాజరవుతానని చెప్పారాయన. ఆ కేసులో కానీ, మరో కేసులో కానీ తనను జైలుకి పంపించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. వారు తనని జైలుకి పంపించాలి అనుకుంటే వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నట్టు ప్రకటించారు అనిల్. ఇటీవల కాలంలో వైసీపీ నేతలు జైలుకెళ్లడానికి రెడీ అనే నినాదాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. అప్పట్లో కొడాలి నాని, ఆ తర్వాత పేర్ని నాని, ఇటీవల అంబటి రాంబాబు కూడా జైలుకెళ్లడానికిర ెడీ అంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో అనిల్ చేరారు. జైలుకెళ్లడానికి తాను కూడా సిద్ధంగానే ఉన్నట్టు ప్రకటించారు. మొత్తానికి అనిల్ కి కూడా తన పై ఉన్న కేసుల విషయంలో అనుమానాలు మొదలైనట్టున్నాయి. అందుకే ముందుగానే జైలుకెళ్లడానికి రెడీ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.