నెల్లూరులో జగన్ పర్యటన హడావిడి ముగిసింది. జనం తండోపతండాలుగా వచ్చారని వైసీపీ చెప్పుకుంటోంది, అసలు జనమే లేక జగన్ పర్యటన వెలవెలబోయిందంటూ టీడీపీ కొన్ని వీడియోలను సాక్ష్యంగా చూపెడుతోంది. మరోవైపు బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో తీసిన వీడియోలను ఇప్పుడు నెల్లూరు వీడియోలుగా వైసీపీ మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోందంటూ ట్రోలింగ్ మొదలైంది. హోం మంత్రి అనిత కూడా బంగారుపాళ్యం వీడియోల గురించి మాట్లాడటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. అనసూయతో జగన్ కి పోలిక పెట్టడం.
😂😂😂#tillutrolls pic.twitter.com/9qQv5RxdAf
— Tillu Trolls (@tillutrolls) July 31, 2025
నెల్లూరుకు అనసూయ..
ఇటీవల నెల్లూరులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చారు సినీ నటి అనసూయ. ఆమెను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. నెల్లూరులో బోసుబొమ్మ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అనసూయ ఓపెన్ టాప్ జీప్ లో జనాలకు అభివాదం చేస్తూ కాసేపు హడావిడి చేశారు. ఆ కార్యక్రమం జరిగిన నాలుగు రోజులకు జగన్ కూడా నెల్లూరు వచ్చారు. నెల్లూరు వైసీపీ నేతలు కాకాణి గోవర్దన్ రెడ్డి, నల్లపురెడ్డి పర్సన్న కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అయితే జనం లేక ఆయన పర్యటన వెలవెలబోయిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నెల్లూరులో జగన్ ని చూడడానికంటే, అనసూయను చూసేందుకే జనం భారీగా తరలి వచ్చారని కంపేరిజన్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు.
నెల్లూరులో జగన్..
వాస్తవానికి గతంలోనే జగన్ నెల్లూరుకు రావాల్సి ఉంది. అప్పట్లో పరామర్శ కేవలం కాకాణి కుటుంబం వరకే ఉండాల్సింది. హెలిప్యాడ్ కోసం పోలీసులు చూపించిన ప్లేస్ నచ్చక జగన్ నెల్లూరుకు రాలేదు. ఈ గ్యాప్ లోనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కొందరు ప్రసన్న ఇంటిపై దాడికి వెళ్లడం జరిగాయి. దీంతో ఒకేసారి ఇద్దర్ని పరామర్శించడానికి జగన్ నెల్లూరు వచ్చారు.
నెల్లూరులో చిత్తూరు వీడియోలు..
ఇటీవల ఏపీలో జగన్ పర్యటనల వల్ల లేనిపోని హడావిడి, ప్రమాదాలు, ప్రాణ నష్టం కూడా చూశాం. నెల్లూరులో అలాంటి ఘటనలు జరగకూడదని పోలీసులు ముందే ఆంక్షలు పెట్టారు. అయితే ఆ ఆంక్షలను దాటుకుని మరీ జనం భారీగా తరలి వచ్చారంటూ వైసీపీ హడావిడి చేస్తోంది. వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో జనం భారీగా వస్తున్న వీడియోలు, ఫొటోలను చూపిస్తున్నారు. ఇక అసలు కథ ఇదీ అంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. జనం లేక జగన్ పర్యటన నీరసంగా సాగిందని అంటున్నారు. ఇది కవర్ చేసుకోడానికి వైసీపీ నానా తంటాలు పడుతోందని, చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన వీడియోలను ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు బయటకు తెస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. మొత్తమ్మీద జగన్ నెల్లూరు పర్యటన విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కింది. ఇక ఈ పర్యటనలో భాగంగా జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ సంచలనంగా మారాయి. సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే వెంటనే నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు, జగన్ కు కౌంటర్ గా ప్రెస్ మీట్లు పెట్టారు, ఘాటు వ్యాఖ్యలతో బదులిచ్చారు.