Janasena Party: వైసీపీకి బిగ్ షాకిచ్చింది జనసేన. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆ మాజీ ఎమ్మెల్యే చేరిక ఒక్కటే కాదు.. పెద్ద క్యూ జనసేన పార్టీ దారిన పట్టడం విశేషం. పిఠాపురంలో ఈనెల 14 వ తేదీన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహాల్లో ఉన్న జనసేనకు, ఈ మాజీ ఎమ్మెల్యే చేరికతో మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు.
ఏపీలో ఎన్నికలు ముగిసిన సమయం నుండి వైసీపీ నుండి వలసలు సాగుతున్న విషయం తెల్సిందే. ముందుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ప్రారంభమైన వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ నేతలు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలలో చేరారు. దీనితో కూటమి పార్టీలు మరింత బలాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. తాజాగా జనసేన పార్టీలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేరారు. పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీని పూర్తి స్థాయిలో దెబ్బతీసేందుకు పవన్ ప్లాన్ వేసినట్లు భావించవచ్చు. ఇప్పటికే పిఠాపురం అభివృద్దిలో తన మార్క్ చూపిస్తున్న పవన్, సొంత నిధులను కూడా వెచ్చించి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఇలా తన మార్క్ పిఠాపురంలో చిరస్థాయిగా నిలిచేలా పవన్ చక్రం తిప్పుతున్నారు. ఈ సంధర్భంగా పిఠాపురంలో వైసీపీ ఊసే లేకుండా చేసేందుకు జనసేన ప్రయత్నించి సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. అందుకే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పార్టీలోకి పవన్ ఆహ్వానించగా, దొరబాబు వెంట వైసీపీకి చెందిన పలువురు జనసేన బాట పట్టారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో దొరబాబు పార్టీలో చేరగా, పవన్ పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. అలాగే పలువురు మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్ లు, జడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీలు, సర్పంచ్ లు జనసేనలో చేరారు. ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ కు దొరబాబు పరిచయం చేశారు. ఇలా తన నియోజకవర్గంలో పవన్ వైసీపీని క్లీన్ స్వీప్ చేశారని జనసేన క్యాడర్ అంటోంది. మొత్తం 60 మంది పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం విశేషం.
Also Read: AP Cabinet: కాకినాడ దశ తిరుగుతోందా? ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం..
అట్టహాసంగా నాగబాబు నామినేషన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ లు పాల్గొన్నారు. అయితే ముందుగా నాగబాబు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వాహనశ్రేణి బయలుదేరింది. నాగబాబు నామినేషన్ కార్యక్రమానికి సమీక్షల రీత్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారని సమాచారం.