Talliki Vandanam Vs Amma Vodi: సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకం అమల్లోకి వచ్చేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో డబ్బు కూడా క్రెడిట్ అవుతోంది. అయితే ఇప్పుడీ పథకంపై అధికార, విపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. మొన్నటి వరకు రాలేదని.. ఇప్పుడేమో దుర్వినియోగమవుతోందంటోంది వైసీపీ. అయితే అమ్మ ఒడి పేరుతో దగా చేశారంటోంది టీడీపీ. ఇంతకీ ఇవన్నీ నోటి మాటలేనా? కేవలం రాజకీయమేనా? అసలు ఎవరి పాలనలో ఎంత మంది లబ్ధిదారులున్నారు? ఎవరు చెబుతున్న లెక్కేంటి?
పథకం అమలు కోసం రూ.8,745 కేటాయింపు
కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఏడాది పాలనపూర్తైన సందర్భంగా ఈ పథకాన్నీ తీసుకొచ్చింది. ఈ పథకం అమలు కోసం 8 వేల 745 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శిస్తోంది వైసీపీ. అంతేకాదు ఈ పథకం డబ్బులు నారా లోకేష్ అకౌంట్‌లో పడుతున్నాయంటూ ఆరోపణలు చేస్తోంది.
వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు
గత ప్రభుత్వంలో లక్షలాది మంది విద్యార్థులకు.. అమ్మ ఒడి పథకం నిధులు అందలేదని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. ఏకంగా 26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఇచ్చిన హామీ ప్రకారం.. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు బడికి వెళుతుంటే వారందరికీ తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామని.. కానీ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు
గత ప్రభుత్వం హామీ ప్రకారం అమ్మఒడిని ప్రతి బిడ్డకు అమలు చేస్తే ఏడాదికి 10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో 50 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేయాల్సి ఉంటుంది.. కానీ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 23 వేల 877 కోట్లు మాత్రమే అంటున్నారు టీడీపీ నేతలు. జగన్ హయాంలో ప్రతియేటా లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారని ఆరోపిస్తున్నారు.
2021 లో 44.48 లక్షల మంది లబ్ధిదారులు
2021లో 44.48 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2023కి ఆ సంఖ్య 42.61 లక్షలకు పడిపోయింది. నేడు కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది లబ్ధిదారులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నారు. గతం కంటే దాదాపు 25 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరుస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనేది కూటమి నేతల మాట.
గతం కంటే దాదాపు 25 లక్షల మందికి అదనంగా లబ్ధి
ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంపై మరో సంచలన ఆరోపణ చేసింది వైసీపీ. తల్లికి వందనం పథకంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13 వేలు, మిగతా 2 వేలు స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి నిధుల నిమిత్తం ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ 2 వేలు మంత్రి నారా లోకేశ్ జేబులోకి పోతున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన నారా లోకేష్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్ అంటూ వైసీపీకి కౌంటర్లు
వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై సవాల్ విసిరితే స్పందన కరవైందన్నారు లోకేష్. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! అంటూ సెటైర్లు వేశారు. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? తేల్చుకోండి అంటూ లోకేశ్ అల్టిమేటమ్ జారీ చేశారు.
అమ్మ ఒడి, తల్లికి వందనం పథకంపై పొలిటికల్ హీట్
మొత్తానికి అమ్మ ఒడి, తల్లికి వందనం పథకంపై ఇప్పటికే పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే..ఇప్పట్లో చల్లారే పరిస్థితిమాత్రం కనిపించడం లేదు.
Story By vamsi krishna, Bigtv Live