BigTV English

TDP : టీడీపీ, జనసేన పొత్తు కుదిరినట్టే..మరి బీజేపీ సంగతేంటి?

TDP : టీడీపీ, జనసేన పొత్తు కుదిరినట్టే..మరి బీజేపీ సంగతేంటి?

TDP : ఏపీలో పొత్తుల రాజకీయాలు తుదిదశకు చేరుకున్నాయి. కొద్దినెలల వ్యవధిలోనే చంద్రబాబు, పవన్ రెండోసారి భేటీకావడంతో టీడీపీ, జనసేన పొత్తు కుదిరినట్టేనని తేలిపోయింది. ఇక అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సిఉంది. వైసీపీ తాము సింహంలా సింగిల్ గానే వస్తామంటోంది. దీంతో ఆ పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్సేలేదు. మరి బీజేపీ సంగతేంటో తేలాల్సి ఉంది.


చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు..
2014 ఎన్నికల తర్వాత టీడీపీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఉపఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాసలో కూరుకుపోయాయి. పార్టీలో నిస్తేజం అలుముకుంది. అయినా సరే చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. సరైన సమయం చూసుకుని అడుగులు ముందుకు వేశారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకున్న ఘటనను అవకాశంగా తీసుకున్నారు. పవన్ కు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ చర్యను ఖండించారు. అదే సమయంలో విజయవాడలో పవన్ ను నేరుగా కలిసి ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అప్పుడే టీడీపీ, జనసేన పొత్తుకు తొలి అడుగు పడింది.

ఇక ఆ తర్వాత ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో టీడీపీలో మళ్లీ జోష్ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట దుర్ఘటనలు జరిగాయి. ఈ ఘటనల జరగగానే బాధిత కుటుంబాలను పరామర్శించడమే కాకుండా భారీగా ఆర్థికసాయం చంద్రబాబు చేశారు. ఈ ఘటనల్లో చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటనలు జరిగాయని టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఇదే అదునుగా ప్రభుత్వం ఏపీలో రోడ్లుపై ర్యాలీలకు, సభలకు అనుమతి నిరాకరిస్తూ జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీంతో కుప్పంలో అడుగడుగునా చంద్రబాబు పర్యటనలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరసన తెలిపారు. తగ్గేదేలే అంటూ కుప్పంలో తన టూర్ పూర్తి చేశారు. ఇదే అదునుగా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ లో బాబు నివాసంలోనే కలిసి 3 గంటలపాటు చర్చించారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తుకు మలి అడుగు పడింది. ఇలా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయాలన్నదే బాబు వ్యూహం. ప్రస్తుతానికి బీజేపీ బాబుతో కలిసేది లేదంటోంది.


టీడీపీవైపే జనసేనాని మొగ్గు..
2014లో ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టకుండా టీడీపీ, బీజేపీ కూటమికి జనసేనాని మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి కటీఫ్ చెప్పారు. వామపక్షాలతో కలిసి 2019 ఎన్నికల బరిలో దిగి ఒక్క సీటు మాత్రమే సాధించారు జనసేనాని. తాను సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీ పంచన చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో వామపక్షాలను వదలిపెట్టి.. బీజేపీతో మళ్లీ దోస్తికి సై అన్నారు. అయితే విజయవాడలో పవన్ ను చంద్రబాబు కలిసి తర్వాత టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని తేలిపోయింది. అయితే బీజేపీ మాత్రం తాము జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం ఈ పొత్తుపై అనుమానాలు కలిగాయి. ఆ తర్వాత విశాఖలో ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీకావడంతో జనసేనాని టీడీపీకి దూరంగా ఉంటారని అందరూ భావించారు. అనుకున్న విధంగానే కొంతకాలం టీడీపీకి కాస్త దూరం పాటించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 మళ్లీ బాబుకు పవన్ ను దగ్గర చేసింది. ఈ ఇద్దరు నేతలు రెండోసారి భేటీ తర్వాత టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని తేలియింది.

బీజేపీ దారెటు..?
ఏపీలో బలం పెంచుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ..జనసేనతోనే కలిసి వెళ్లాలని భావిస్తోంది. టీడీపీతో పొత్తకు నై అంటోంది. మరి జనసేనాని చంద్రబాబు వెంటే నడవాలనుకుంటున్నారు. బీజేపీని కూడా ఆ కూటమిలో చేర్చుకోవడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీజేపీ ఏం చేస్తుంది? మళ్లీ 2014 కాంబినేషన్ కు రెడీ అవుతుందా? లేక ఒంటరిగా పోటీకి దిగుంతుందా? ఆ ఛాన్సే లేదు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తేనే బీజేపీ లబ్ధి చేకూరుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి బీజేపీ దారెటో తేలాల్సిఉంది. మొత్తం మీద చంద్రబాబు వ్యూహం ప్రకారం పవన్ ను తనవైపు లాగి..బీజేపీని ఇరుకునపెట్టారు. ఇక తప్పనిసరిగా టీడీపీ, జనసేనతో కలవాల్సిన పరిస్థితిని కాషాయ పార్టీకి కల్పించారు. మరి బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×