Congress Dissatisfaction: స్వేచ్ఛ బ్యూరో: శాసనసభ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులవుతున్నా, కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కొండా సురేఖల జాడ లేకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.అసెంబ్లీ లాబీల్లో,గాంధీభవన్ వర్గాల్లో ఎక్కడ చూసినా వీరిద్దరి గైర్హాజరీపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. పైగా ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కాంగ్రెస్ లో ఉన్నది. ఈ ఇద్దరు నేతల అసంతృప్తికి వేర్వేరు రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ, రెండింటికీ మూలం మాత్రం ‘మంత్రివర్గ సమీకరణాలే’ కావడం గమనార్హం.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలినుంచీ మంత్రి పదవిపై భారీ ఆశలే పెట్టుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని భావించినప్పటికీ, సమీకరణాల రీత్యా ఆయనకు అవకాశం లభించలేదు.
ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలోనైనా తన పేరు ఉంటుందని భావించిన రాజగోపాల్ రెడ్డికి మళ్లీ నిరాశే ఎదురైంది. స్వయంగా సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నదని మంత్రి ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టారు. పైగా తాజాగా మునుగోడు సభ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల సమీకరణలు సెట్ అయ్యాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయిందని పార్టీలో చర్చ ఉన్నది. కానీ వర్షాకాల సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం చర్ఛాంశనీయమైంది.
Also read: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!
మరొకవైపు,సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కూడా సభకు హజరు కాలేదు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ప్రభుత్వంలో చోటుచేసుకున్న కొన్ని వివాదాల నేపథ్యంలో ఆమె తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న సురేఖ, పదవి నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె, అసెంబ్లీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని సమాచారం. పార్టీలో తమ ప్రాధాన్యత తగ్గిపోతుందనే భావన ఆమె వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత తాను అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించినప్పటికీ, గడిచిన మూడు రోజుల్లో ఆమె అసెంబ్లీకి రాకపోవడం గమనార్హం.
శాసనసభ లాబీల్లో ప్రతిపక్షాల విమర్శల కంటే.. అధికార పార్టీకి చెందిన ఈ ఇద్దరి గైర్హాజరీపైనే అందరి ఫోకస్ ఉన్నది. వైఎస్ అభిమానులుగా ఎదిగిన ఈ ఇద్దరు నేతలు సభకు ఎందుకు హాజరు కావడం లేదనే దానిపై విభిన్న తీరుల్లో డిస్కషన్ జరుగుతున్నాయి. వీరిద్దరూ కేవలం సభకు మాత్రమే దూరం ఉంటారా? లేక రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుపై ఏవైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అనేది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.పైగా ముఖ్యమైన సమావేశాల సమయంలో సీనియర్ నేతలు అసెంబ్లీకి దూరం కావడం ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం కూడా ఉన్నదనే చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Also read: సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?