అసెంబ్లీ సమావేశాలకు రాను, రాబోను అని జగన్ ఖరాఖండిగా చెప్పేశారు. ప్రతిపక్ష నేత హోదా అనేది కేవలం ఒక సాకు మాత్రమే. అసెంబ్లీకి వస్తే 164మంది ఎమ్మెల్యేల మధ్య 11మందితో తాను నెగ్గుకు రాలేనని జగన్ కి తెలుసు. అందుకే జగన్ అసెంబ్లీకి మొహం చాటేశారు. మరి కూటమి ఊరుకుంటుందా. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తోంది. తొలి సమావేశాల్లో రఘురామకృష్ణంరాజు, జగన్ చెవిలో అసెంబ్లీకి రావాలని ప్రేమగా చెప్పారు. జగన్ కుదరదన్నారు. ఇప్పుడు అనర్హత వేటు అంటున్నారు. దీనికి కూడా జగన్ ఒక లాజిక్ రెడీగా పెట్టుకున్నారు. అయితే కూటమి నేతలు ఓ పట్టాన ఈ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. పదే పదే జగన్ అసెంబ్లీకి రావాల్సిందేనంటూ రోజుకొకరు మీడియా ముందుకొచ్చి విమర్శిస్తున్నారు. ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా?
జగన్ చిన్నపిల్లాడా?
అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అని అనాలనేది చాలామంది కల అని, అయితే జగన్ పుణ్యమా అని ఆ కల వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు లేదని ఎద్దేవా చేశారు మంత్రి వంగలపూడి అనిత. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని, ఆ వేదికను వాడుకోకపోవడం, తనతోటి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఆవైపు వెళ్లొద్దని చెప్పడం సరికాదన్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదాపై కూడా మంత్రి సెటైర్లు పేల్చారు. ప్రతిపక్ష హోదా కావాలని చిన్న పిల్లాడిలా జగన్ మారం చేస్తున్నారని, అదేమైనా చాక్లెట్టా, బిస్కెట్టా అని ప్రశ్నించారు.
అది కూడా కరెక్టేకదా..
గత అసెంబ్లీ నుంచి చంద్రబాబు వెళ్లిపోయిన సందర్భాన్ని ఇటీవల వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు తానొక్కరే అసెంబ్లీనుంచి వెళ్లిపోయారని తన ఎమ్మెల్యేలను మాత్రం అసెంబ్లీకి వెళ్లాలనే చెప్పారన్నారు అనిత. మరిప్పుడు జగన్ చేస్తున్నదేంటని ఆమె ప్రశ్నించారు. జగన్ తనతోపాటు గెలిచిన మిగతా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లొద్దని చెబుతున్నారని, ఇదెక్కడి లాజిక్ అని నిలదీశారు. జగన్ రాకపోతే అసెంబ్లీ ఆగదని, వైసీపీ బ్యాచ్ అంతా రాజీనామా చేసి వెళ్లినా నష్టమేమీ లేదన్నారు అనిత. ఉప ఎన్నికలు జరిగితే వారు కూడా ఓడిపోతారని కౌంటర్ ఇచ్చారు.
అనర్హత వేటు?
అనర్హత వేటు నిబంధనపై జగన్ అమాయకంగా మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) చదివితే అనర్హత వేటు గురించి ఏం రాసి ఉందో అర్థమవుతుందని జగన్ కి ఆయన సూచించారు. ఒకవేళ అది జగన్ కు అర్థం కాకపోతే న్యాయవాదులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చని అన్నారు యనమల.
అసెంబ్లీ రూల్స్..
తాజాగా అసెంబ్లీ రూల్స్ ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మరోసారి జగన్ కి గుర్తు చేశారు. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆ రూల్స్ ని పాటించాలని సూచించారు. అసెంబ్లీలో పార్టీలకు ఎంత సమయం కేటాయించాలనేది వారి బలాబలాలపై ఆధారపడి ఉంటుందని, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి కూడా మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
మొత్తమ్మీద జగన్ అసెంబ్లీకి రావాలని కూటమి నేతలు కోరుకుంటున్నట్టు తెలుస్తోంద. అప్పట్లో చంద్రబాబుని ఇబ్బంది పెట్టినట్టే జగన్ ని కూడా ఇరుకున పెట్టాలనేది వారి ఆలోచన. అయితే జగన్ తెలివిగా తప్పించుకుంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా పేరు చెప్పి అసెంబ్లీకి ఎగనామం పెట్టారు.