Ap Assembly: అసెంబ్లీలో విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే ఐఏఎస్‌తో దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే తీరుతో షాక్ అయిన మంత్రి ఎదురు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. తిరుపతి టూర్ తర్వాత ఆయనతో మాట్లాడతానని చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మహిళా ఐఏఎస్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
బుధవారం అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో మంత్రులు ఉండే గ్యాలరీకి వెళ్లారు కొందరు ఐఏఎస్ అధికారులు . అక్కడ రెవిన్యూ శాఖకు చెందిన మహిళా ఐఏఎస్‌లతో గొడవకు దిగారు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. ఫైల్ ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో వివరిస్తుండగా, సదరు ఎమ్మెల్యే రుసరుస లాడారట. తాను సిఫార్సు చేసిన అధికారిని కావాలనే బదిలీ చేశారని ఆరోపించారు. పేదలు ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేదా? ఎంత ధైర్యం ఉంటే తన పనులను అడ్డుకుంటారని గట్టిగానే నిలదీసినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే వీరంగం సమాచారం అందుకున్న రెవిన్యూ మంత్రి, ఆ ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనపై కూడా ఎమ్మెల్యే విరుచుకుపడినట్టు సమాచారం. తనను అడ్డుకోవడం ఏమిటి? మీకసలు ఫైళ్లు చూడటం వచ్చా? అని మంత్రిని ప్రశ్నించారట. మంత్రి వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతోందా? ఏ పని ఎప్పుడు చేయాలో తెలుసా? పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్‌లో ఫెయిల్ అయ్యారని ఆరోపించినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే తీరుతో రెవిన్యూ మంత్రి షాకయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేపై మంత్రి ఎదురుదాడి చేసినట్టు తెలుస్తోంది. పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వం ముందుందని, అంతేగాని అక్రమార్కులకు మేలు చేయడానికి సిద్ధంగా లేదన్నారు. కాలువ గట్లు, రోడ్లను ఆక్రమించి రెగ్యులరైజ్ చేయమంటే అదెలా సాధ్యమని ప్రశ్నించారు మంత్రి. రూల్స్‌కు విరుద్ధంగా మంత్రిగానీ, అధికారి పని చేయరని తేల్చేశారట. అధికారులను గౌరవించడం చేత కాకపోతే మాట్లాడొద్దు.. హీరోలు కావద్దని లైట్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారం మరింత ముదరడంతో ఇతర ఎమ్మెల్యేలు సదరు ఎమ్మెల్యేను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.
ALSO READ: పవన్ కీలక ప్రకటన.. మోదీ రికార్డును బాబు సమం చేయాల్సిందే
అసలేం జరిగింది?
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి ఊరట ఇచ్చేలా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. 150 గజాల్లోపు స్థలంలో రేకుల ఇళ్లు, ఆర్‌సీసీ భవనాలను నిర్మించుకుని చాలామంది ఉన్నారు. అలాంటి వాటిని క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. అందులో కాల్వ గట్లు, చెరువులు, కుంటలు, రక్షణ శాఖ భూముల క్రమబద్దీకరణ నుంచి మినహాయించింది. ప్రభుత్వ, పోరం బోకు భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు మాత్రమే అవకాశం కల్పించింది.
ఈ క్రమంలో విజయవాడ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే కొన్ని రోజులు ప్రభుత్వ స్థలం క్రమబద్దీకరణ రెవిన్యూ శాఖకు సిఫార్సు చేశారు. కోట్ల ఖరీదు చేసే 900 గజాల భూమి దరఖాస్తు ఉంది. ఆ భూములు ఇరిగేషన్ పరిధిలో ఉన్నావని, క్రమబద్దీకరణ చేయడానికి కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. ఇదీ అసలు జరిగిన విషయం.
ఎమ్మెల్యే రుసరుసలాడిన వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. జరిగిన తతంగంపై సమాచారం తెప్పించుకున్నారు. తన పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చిన తర్వాత మంత్రితో మాట్లాడారు. రేపో మాపో ఆ ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడుతానని సీఎం చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.