Pawan Kalyan: పార్టీ కార్యకర్తల ఆశలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీళ్ళు జల్లారా? పదే పదే పవన్ ఆ మాట ఎందుకు అంటున్నారు? దీనిపై ఇరు పార్టీల నేతలు ఏమంటున్నారు? మరో 15 ఏళ్లపాటు సీఎం కుర్చీ పవన్‌కు అందని దాక్షేనా? అవుననే అంటున్నారు జనసేన అధినేత. ఆయన వ్యాఖ్యలు వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
పవన్ మళ్లీ అదే మాట
గడిచిన ఐదేళ్లు ఏపీని వైసీపీ సర్వనాశనం చేసింది పదే పదే కూటమి ముఖ్యనేతలు చెబుతున్నారు. చివరకు బయట నుంచి అప్పు తీసే స్థాయి లేకుండా చేశారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన పనులను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో వెల్లడించారు. మరో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకున్నట్లు కుండబద్దలు కొట్టేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటల పోటీలు ముగింపు సందర్భంగా విజయవాడలోని ఎ కన్వెన్షన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థుతుల్లో చంద్రబాబు వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే గాడిన పడుతుందన్నారు. లేకుంటే కష్టమన్నది ఆయన మనసులోని మాట. అదే విషయాన్ని పదేపదే చెప్పారు.. చెబుతున్నారు కూడా. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మూడు సార్లు ప్రధాని అయ్యారని అన్నారు. చంద్రబాబు కూడా మూడుసార్లు ముఖ్యమంత్రి కంటిన్యూగా కావాలన్నారు. ఆయన ఆధ్వర్యంలో పని చేయడానికి తాను ఎప్పుడు సిద్దమనేనన్నారు.
ALSO READ: మాట తప్పారు.. మడమ తిప్పారు
పవన్ మాటల వెనుక
పవన్ ఆ మాట ఎందుకన్నారని కాసేపు పక్కనబెడదాం. రాజకీయ నేతల మాటలు కత్తి మాదిరిగా రెండువైపులా పదును ఉంటుందని అంటారు కొందరు నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించిన వాళ్లు లేకపోలేదు. ఎందుకంటే వచ్చేసారి కూటమి గెలిస్తే లోకేష్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనే చర్చ తెలుగు తమ్ముళ్లలో బలంగా ఉంది.
అందుకే మంత్రి పదవులు, ఛైర్మన్, కార్పొరేషన్లు యవతానికి ఆ పార్టీ ప్రయార్టీ ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అదేమీకాదు దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కనీసం దశాబ్దం పైగా ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే కోలుకుంటుందని, లేకుంటే ప్రజలు, యువత భారీగా నష్టపోతారని గుర్తు చేశారు. 2019లో జరిగిన తప్పు ఈసారి పునరావృతం కాదని అంటున్నారు.
జాగ్రత్తగా గమనిస్తున్న వైసీపీ
పవన్ చేసిన.. చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. పవన్ పదే పదే చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పడం వెనుక ఏదో జరుగుతోందని అంటున్నారు వైసీపీలోని కొందరు హార్డ్‌కోర్ నేతలు. ఎందుకంటే కూటమి నెక్ట్స్ అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఆ ఛాన్స్ ఇవ్వకుండా పవన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు.
సీఎం చంద్రబాబు ఇంత ఆనందంగా నవ్వడం తాను చూడలేదన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర ప్రజల బాధ్యత మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ గంభీరంగా ఉంటారన్నారు. ఇలా హాయిగా నవ్వే పరిస్థితి ఉండదన్నారు. చంద్రబాబును మనస్ఫూర్తిగా నవ్వించేలా ప్రదర్శన, స్కిట్లు చేసినవారికి అభినందించారు.
స్పీచ్ చివరలో డిప్యూటీ సీఎం మరో మాట చెప్పారు. రాజకీయాలు అంటే ప్రజాసమస్యలపై పోరాటం కాదన్నారు. వ్యక్తిగత కక్షలు అస్సలు కావన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనుబంధం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత వచ్చే ఏడాది నుంచి తాను పార్టిసిపేట్ చేయాలని ఆలోచన వచ్చిందన్నారు.