నిన్న మొన్నటి వరకు 11 అనేది ఏపీలో హాట్ టాపిక్. ఇప్పుడు ఆ ప్లేస్ ని 3452. ఈ నెంబర్ ప్రాముఖ్యత ఏంటి అనుకుంటున్నారా..? జగన్ ఇప్పటి వరకు కోర్టు వద్ద తీసుకున్న వాయిదాలు. ఇటీవల జగన్ పదే పదే సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన లిక్కర్ కేసులో బెయిల్ పై తిరుగుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై ఉన్న కేసులు, వాయిదాలు, కోర్టు కేసుల లెక్కలన్నీ టీడీపీ బయటకు తీసింది. దీంతో వైసీపీ ఉడుక్కుంది. తమ నాయకుడిపై ఇలా నోరు పారేసుకోవడమేంటని ఎదురుదాడికి దిగింది.
ప్రపంచ రికార్డ్..
ఇటీవల పదే పదే చంద్రబాబుపై కేసులున్నాయని, ఆయన బెయిల్ పై తిరుగుతున్నారంటూ జగన్ తన ప్రెస్ మీట్లలో ప్రస్తావిస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ పక్కా సమాచారం సేకరించింది. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఈ లెక్కలన్నీ బయటపెట్టారు. టీడీపీ సోషల్ మీడియా ఆ వివరాలను హైలైట్ చేసింది. ఆ లెక్కల ప్రకారం జగన్ 3,452 కోర్టు వాయిదాలతో ప్రపంచ రికార్డు సృష్టించారట. ఆయనపై 7 ఈడీ, 11 సీబీఐ కేసులతో సహా మొత్తం 31 కేసులున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 3,452 సార్లు వాయిదాలు తీసుకోవడం ఆయన సాధించిన ప్రపంచ రికార్డు అని టీడీపీ అంటోంది. తన కేసులు వాదించే న్యాయవాదులకు గంటకు రూ.12 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు జగన్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారట. ఒక్కో కోర్టు వాయిదాకు రోజూ రూ.1.39 కోట్ల చొప్పున జగన్ ఖర్చు చేస్తున్నారట. సగటున లీగల్ ఫీజుల కోసమే జగన్ ఇప్పటి వరకు రూ.6,904 కోట్లు ఖర్చు పెట్టారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. జగన్ తన పై ఉన్న 31 కేసుల విషయంలో బెయిల్ తీసుకుని 5 వేల రోజులుగా బయట తిరుగుతున్నారని, ఇప్పటి వరకు కొన్ని కేసులు ట్రయిల్ కి కూడా రాలేదని అంటున్నారు టీడీపీ నేతలు. జగన్ కి దమ్ముంటే కోర్టుకి ప్రతి రోజు విచారణకు వెళ్లాలని, వాటి సంగతి తేల్చాలని కోర్టుని అడగాలని సూచించారు.
ఇదేం పద్ధతి..?
టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానాలు లేవు. జగన్ పై ఎన్ని కేసులున్నాయి, ఎన్ని వాయిదాలతో కేసుల్ని నెట్టుకొస్తున్నారు, ఎన్నిసార్లు బెయిల్ తీసుకున్నారు.. ఇలాంటి లెక్కలతో వైసీపీకి షాకిచ్చింది టీడీపీ. దీంతో వైసీపీ నేతలు ఈ ప్రెస్ మీట్ ని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రెస్ మీట్ భావం గురించి మాట్లాడలేదు కానీ, భాష బాలేదంటున్నారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఆనం వెంకట రమణారెడ్డి వికృత మాటలు చంద్రబాబు నిరంకుశ విశృంఖలత్వ మనస్తత్వానికి నిదర్శనం అంటూ వైసీపీ ట్వీట్ వేయడం విశేషం. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి.. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందని ఆ ట్వీట్ లో వైసీపీ విమర్శించింది. హామీల అమలు గురించి తాము వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తే.. తమ నాయకుడిని బూతులు తిట్టిస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ తాజా లెక్కలతో మరోసారి జగన్ పై ట్రోలింగ్ మొదలైంది. ఇన్నాళ్లూ 11 అంటూ ఆయన్ను, ఆయన పార్టీని ఆట పట్టించేవారు టీడీపీ, జనసేన అభిమానులు. ఇప్పుడు 3452 అంటూ కౌంటర్లిస్తన్నారు. 3452 కోర్టు వాయిదాలు తీసుకున్న జగన్ ఎలా నాయకుడవుతారని, లాజిక్ తీస్తున్నారు. మరి వైసీపీ సూటిగా ఇవే ప్రశ్నలకు సమాధానం చెప్పగలదా..? లేక వారి భాష బాగోలేదు, ప్రజలే బుద్ధి చెబుతారంటూ సర్దిచెప్పుకుంటుందా..? వేచి చూడాలి.