Unmarried youth: ఒకప్పుడు పెళ్లి అంటే మన జీవితంలో పెద్ద పండుగ. పెద్దలు చూసిన సంబంధం, కుటుంబానికి అనుకూలత, కొన్ని మాటలు, కొన్ని ముచ్చట్లు చాలు.. అవే నిశ్చితార్థానికి దారి తీసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పెళ్లి అనేది మనసుకు నచ్చిన వ్యక్తిని కనుగొనడమే కాదు, డబ్బు, భవిష్యత్తు భద్రత, భౌతిక ప్రమాణాల్ని బట్టి నిర్ణయించే వ్యవహారంగా మారింది. ఇదే సమయంలో పెళ్లి కాని ప్రసాదులు అనే వర్గం తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. దానికి తోడు పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు బెంబేలెత్తిస్తున్నాయి.
ఇటీవల మన చుట్టూ చాలా మంది యువత వయస్సు దాటి కూడా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతున్నారు. వీరిని ముద్దుగా పెళ్లి కాని ప్రసాదులు అని పిలవడం కామన్ గా మారింది. చదువు, ఉద్యోగం, ఆత్మవిశ్వాసం పెరగడంతో వివాహం అవసరమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు నడుస్తున్నాయి. అలానే, కొన్ని కుటుంబాల్లో సంబంధాలు సరిగా జరగక, పిల్లలు ఎదిగిపోయినా ఇంకా పెళ్లి బంధం కుదరడం లేదు. దానికి కారణం తల్లిదండ్రుల అంచనాలు ఎక్కువగా ఉండటం, లేదా పిల్లల ఆశలు ఓ లెవల్‌కు ఎక్కువగా పెరగటం.
ఇదిలా ఉంటే, మరోవైపు పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు మాత్రం దారుణంగా మారిపోతున్నాయి. వివాహం అనే మాటను ముసుగుగా పెట్టుకుని, కొంతమంది అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ ఆ తర్వాత మాయం అయ్యాడు అనే వాక్యాలు సామాన్యంగా వినిపిస్తున్నాయి. కొందరు యువకులు ఫేక్ ప్రొఫైల్‌లతో ప్రేమ పేరుతో మాయ చేసి, పెళ్లి మాట తీసుకొచ్చి, చివరికి డబ్బు దోచేసే స్థాయికి చేరిపోయారు.
ఇది మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకూ ఎదురవుతున్న సమస్య. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెళ్లి నిమిత్తంగా ఉన్న వధూవర పరిచయ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న మోసాల సంఖ్య పెరుగుతోంది. నకిలీ వివరాలు, తప్పుడు వయస్సు, డబ్బు సంపాదన వివరాలను తప్పుగా చూపించడం వంటి విషయాలు ఇప్పుడు కామన్‌గా మారిపోయాయి. మాటలకంటే సోషల్ మీడియా ఫోటోలకు ఎక్కువ నమ్మకం పెరిగింది. కానీ నిజాయితీ, విలువలపై విచారణ ఉండకపోవడంతో సంబంధాలు మధ్యలోనే తుంటిపడుతున్నాయి.
అదే సమయంలో పెళ్లి పేరుతో కొన్ని కుట్రలు.. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని శారీరకంగా ఉపయోగించుకొని, చివరికి ‘ఇంకా సిద్ధంగా లేను’ అనే డైలాగుతో దూరం అయ్యే వారు. ఇది అమ్మాయి జీవితాన్ని చిన్నబర్చే విషయం. దీనికి చట్టపరమైన చర్యలు అవసరం అయినా, చాలా మంది సిగ్గుతో బయటకి చెప్పుకోలేరు. అందుకే ఇలా మోసపోయినవారి సంఖ్య చూస్తే ఆశ్చర్యమే కాదు.. ఆవేదన కూడా కలుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేయకపోవడం ఓ శాపంగా మారుతోంది. సమాజంలో ఇంకో తరహా ఒత్తిడి ఏర్పడుతోంది.. అంటే ఇంకా పెళ్లి చేసుకోలేదా?, ఎంత వయసైనా నువ్వు ఒంటరిగా ఎందుకు ఉన్నావ్? అనే ప్రశ్నలు వ్యక్తిగతంగా బాధ పెడుతున్నాయి. ఒకపక్క పెళ్లి చేయాలి అనుకుంటే అసలు నమ్మదగిన సంబంధాలు కనిపించడం లేదు. మరొకపక్క పెళ్లి చేసుకోవాలనే ఉత్సాహం డబ్బు, భవిష్యత్తు భారం ముందు చలించిపోతోంది.
తొలి వేటలోనే ప్రేమను నమ్మి పెళ్లి ఆశపడే వారు, మోసపడి మనోధైర్యం కోల్పోతున్నారు. పైగా కోర్టు, పోలీస్ కేసులు, విడాకుల గణాంకాలు చూస్తే పెళ్లి వ్యవహారాన్ని చాలామంది పక్కన పెట్టేస్తున్నారు. ఇది కూడా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగే మరో ప్రధాన కారణం.
అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. పెళ్లి అనే వ్యవహారాన్ని మానసికంగా కూడా సిద్ధమవుతూ, ఆత్మవిశ్వాసం, నిజాయితీతో ముందుకెళ్లేలా చూడాలి. సంబంధం అనేది డబ్బు మీద కాదు.. నమ్మకం మీద అవుతుంది. అప్పుడే వివాహం ఓ మధురమైన ప్రయాణంగా మారుతుంది.
ఇక మనం పెద్దలుగా, సమాజంగా మరోక ముఖ్యమైన బాధ్యత వహించాలి. పెళ్లి కావడమే జీవిత విజయమేమీ కాదు.. పెళ్లి లేకపోవడమే ఓ తప్పు అనేవి అంతర్గతంగా తొలగించాలి. ప్రతి ఒక్కరూ తమ జీవితం తాము ఎంచుకునే హక్కు ఉన్నదన్న అర్థం మనకు రాకపోతే.. మోసాలూ, ఒంటరితనాలూ, ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి.