వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో వైసీపీ రచ్చ చేయాలి. కానీ ఆ పార్టీ సైలెంట్ గా ఉంది. అసలు పార్టీ మారిన వారెవరూ తమకు తెలియదన్నట్టే ప్రవర్తిస్తున్నారు వైసీపీ నేతలు. ఆ పార్టీ మీడియా, సోషల్ మీడియా కూడా ఈ కండువాల మార్పిడిని అస్సలు పట్టించుకోలేదు. వైసీపీ తేలుకుట్టిన దొంగలా ఉందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
అర్హత ఉందా?
పార్టీ మార్పు వ్యవహారంపై అప్పట్లో జగన్ పెద్ద పెద్ద లెక్చర్లు దంచేవారు. తమ పార్టీకి చెందిన 23మందిని టీడీపీ లాగేసుకుందని అందుకే ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలే వచ్చాయని చెప్పేవారు జగన్. సీన్ కట్ చేస్తే 2019లో వైసీపీ విజయం తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంది. అయితే ఇక్కడ జగన్ చిన్న ట్రిక్ ప్లే చేశారు. నేరుగా ఆ ఎమ్మెల్యేలెవరికీ కండువాలు కప్పలేదు. లాజికల్ గా వారి కుటుంబ సభ్యులకు వైసీపీ తీర్థం ఇచ్చి, ఆ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీలు మాత్రం టీడీపీకి, తమ పదవులకు రాజీనామా చేసి, వైసీపీలో చేరి తిరిగి అవే స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఇక్కడే జగన్ అతి తెలివి అర్థమవుతుందని టీడీపీ విమర్శించింది. 2024లో కూటమి ఘన విజయం తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే సీఎం చంద్రబాబు మాత్రం చేరికలపై దృష్టిపెట్టలేదు. ఆయన దృష్టిపెట్టకపోయినా వచ్చేవారు ఆగరు కదా. అందుకే వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ పోతుల సునీత అదనుకోసం ఎదురు చూసి బీజేపీ గూటికి చేరారు. వాస్తవానికి ఆమెను చేర్చుకోవడం టీడీపీకి ఇష్టం లేదు. అందుకే ఆమె బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడు టీడీపీ కూడా స్పీడ్ పెంచింది. ముగ్గురు ఎమ్మెల్సీలకు పసుపు కండువాలు కప్పింది.
వైసీపీలో కూలీ బతుకు..
మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్‌చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తాజాగా టీడీపీలో చేరారు. ఈ క్రమంలో వైరు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో కూలీ బతుకు వద్దనుకునే టీడీపీలో చేరామని వారు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, అందుకే తాము పార్టీ మారామన్నారు. వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే టీడీపీలో చేరామన్నారు. అయితే వీరి రాజీనామాలను ఇంకా మండలి చైర్మన్ ఆమోదించకపోవడం విశేషం.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అందుకే సభకు హాజరుకావాలనుకోవట్లేదని ఇటీవల జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీటింగ్ లో మరోసారి చెప్పారు. అదే మీటింగ్ లో ఆయన మండలిలో మనకున్న బలాన్ని చూపాలన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఉద్భోదించారు. ఆ మరుసటి రోజే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారడం విశేషం. పార్టీ మార్పు వల్ల ఇప్పటికిప్పుడు ఆ ముగ్గురుకి కానీ, టీడీపీకి కానీ వచ్చిన లాభం ఏమీ ఉండదు. అయితే వైసీపీలో నాయకులకు ఊపిరాడటం లేదని, ఆపార్టీ విధానాలు సరిగా లేవని చెప్పేందుకే ఈ మార్పులు ఉపయోగపడతాయని విశ్లేషకులంటున్నారు. కాస్త ఆలస్యంగా అయినా ఈ మార్పుపై వైసీపీ స్పందిస్తుందేమో చూడాలి.