Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం రద్దీ కొనసాగుతోంది. శ్రావణ సోమవారం మొదలు ఏడు కొండలపై రద్దీ కంటిన్యూ అవుతోంది. సోమవారం 77 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. చాలా రోజుల తర్వాత హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.
శ్రావణ సోమవారం నేపథ్యంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో అంటే రూ.5.44 కోట్ల హుండీ కానుకలు వచ్చినట్టు వెల్లడించింది టీటీడీ. 28 వేలకు పైగానే భక్తులు తలనీలాలు సమర్పించి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి దాదాపు 12గంటల సమయం పడుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పటి మాదిరిగానే కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 20 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. గరుడ పంచమి నేపథ్యంలో మంగళవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించారు.
రాత్రి 7 గంటలకు మొదలైంది గరుడ వాహన సేవ. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదో రోజు నిర్వహిస్తారు. ఈ పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు చేస్తున్నారు. మరికొందరు తమకు పుట్టబోయే సంతానం పూజలు చేయడం చాన్నాళ్లుగా వస్తోంది.
ALSO READ: ఇంకెంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి, వైసీపీ నేతలకు జగన్ చురక
మరోవైపు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జులై 29 నుండి 31 వరకు (గురువారం) జరుగుతాయి. జులై 29న అంటే మంగళవారం సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవంతో ప్రారంభమయ్యాయి. జులై 30న ఉదయం యాగశాల పూజ, 10 గంటలకు స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, ఆరున్నరకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహన సేవలు జరగనున్నాయి. గురువారం అంటే జులై 31న ఉదయం యాగశాల పూజతో కార్యక్రమం మొదలవుతాయి. ఉదయం 6.30 గంటలకు స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభి రాముడు విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.