Tirumala Vip Break Darshan Cancelled: శ్రావణమాసం ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమలలో అమాంతంగా రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడితో గురువారం రోజు రూ.6.93 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
తిరుమల.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. గోవిందా గోవిందా నామస్మరణతో ఏడు కొండలు పులకరించిపోతాయి. ఏడాదికి ఒక్కసారి స్వామిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. తాజాగా తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శని, ఆది, సోమవారం వరుసగా సెలవులు కావడంతో స్వామివారి దర్శనం కోసం ఏడు కొండలకు తరలి వస్తున్నారు భక్తులు. భక్తుల అనూహ్య రద్దీ కనిపించిందని తెలిపింది టీటీడీ. క్యూలైన్లలోని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. ఈ నెల 12న నుంచి 14 వరకు వరుస సెలవులు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసింది టీటీడీ. భక్తుల రద్దీని దృష్టి పెట్టుకున్న టీటీడీ, కీలక నిర్ణయం తీసుకుంది. 13న అనగా ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటన చేసింది. ఈనెల 12న అంటే శనివారం సిఫార్సు లేఖలు స్వీకరించరని తెలిపింది. రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తామని పేర్కొంది. ఈ విషయంలో టీటీడీకి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు సమర్పించారు భక్తులు. గురువారం రోజున రూ.6.93 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ చరిత్రలో మరో భారీ స్థాయి హుండీ ఆదాయం ఇది. గతంలో అంటే 2023 జనవరి 2న రూ.7.60 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. తిరుమల చరిత్రలో అది ఆల్‌టైమ్ రికార్డుగా చెబుతున్నారు. ఆల్‌టైమ్ రికార్డుకు చేరువలో తాజాగా రూ.6.93 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇదిలావుండగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే ఉద్యోగులు.. భక్తులకు అంకిత భావంతో సేవలందించాలని కోరారు టీటీడీ జేఈవో గోపినాథ్. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సేవలందించే ఉద్యోగులు తమ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు.
ALSO READ: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనుంది. గురువారం టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ మ్యూజియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మ్యూజియంలోని కళా కృతులను భక్తులు పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా ఉండాలన్నారు. భక్తులు ఫీడ్ బ్యాక్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.