Tirumala News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి ఎందరో భక్తులు తిరుమలకు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుండి కూడా శ్రీవారి దర్శనానికి వస్తారు. కానీ శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అలాగే తిరిగి వచ్చే సమయంలో ఇలా చేస్తే మీ డబ్బు మీకు అందుతుంది. ఇంతకు ఏమి చేయాలో తెలుసుకుందాం.
గోవిందా అనే నామస్మరణం నోట పలికినా చాలు కదా.. ఆ దేవదేవుని ఆశీస్సులు ఉంటాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే తిరుమల మాడవీధులు నిరంతరం గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. రోజుకు సుమారు లక్ష మంది భక్తులు, శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల రద్దీ అధికం. శేషాచలం కొండల మార్గం గుండా తిరుమలకు చేరుకొని, ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం పొందాలని, సుదూర ప్రాంతాల నుండి భక్తులు తిరుమలకు వస్తారు. అంతేకాదు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం గుండా కూడా స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరుతారు.
ఇలా ఎందరో భక్తులు నిరంతరం వచ్చే తిరుమల పర్యావరణ పరిరక్షణకు కూడా ఆదర్శంగా ఉండాలన్నది టీటీడీ లక్ష్యం. అందుకే నో ప్లాస్టిక్ జోన్ గా తిరుమలను ప్రకటించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను, దబ్బాలను వినియోగించకూడదన్నది అసలు ఉద్దేశం. పవిత్రమైన తిరుమల గిరులు స్వచ్చమైన ప్రకృతికి నిదర్శనంగా పేరుగాంచాలని టీటీడీ పలు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా శ్రీవారి భక్తులకు గాజు సీసాలో నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ బాటిల్స్ ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అయితే భక్తులు రూ. 50 లు చెల్లించి నీరు గల గాజు సీసాను కొనుగోలు చేస్తూ, టీటీడీ తీసుకున్న నిర్ణయానికి బాసటగా నిలుస్తున్నారు. ఇక్కడే టీటీడీ తీసుకున్న మరో నిర్ణయం తెలియని భక్తులు, వాటిని అలాగే గృహాలకు తెచ్చుకుంటారు. కానీ శ్రీవారి భక్తులు దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణం సమయంలో ఆ గాజు సీసాను ఏ షాపులో అప్పగించినా, వారికి రూ.30 లు తిరిగి అందిస్తారు. అంటే కేవలం రూ. 20 లతో మనం స్వచ్చమైన నీటిని కొనుగోలు చేసినట్లుగా భావించవచ్చు. భక్తుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకై టీటీడీ గాజుసీసాలో నీటిని అందించే కార్యక్రమం నిర్వహించడం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు తిరుమల వెళ్తున్నారా.. గాజుసీసాలో నీరు త్రాగండి.. తిరుగు ప్రయాణంలో అదే సీసా అప్పగించి రూ. 30 లు రిటర్న్ తీసుకోవడం మరచిపోవద్దు సుమా!