TTD – Karthika Deepotsavam: అసలే కార్తీకమాసం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.
ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 66,441 మంది భక్తులు దర్శించుకోగా.. 20,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.12 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read: Cheapest Flight Ticket: కేవలం రూ. 800కే విమాన ప్రయాణం, ఎక్కడో తెలుసా?
నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.