టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనుషులు మారడం లేదు. ఇప్పటికీ కొంతమంది రోగాలు వస్తే ఆస్పత్రికి వెళ్లకుండా భూతవైద్యుల వద్దకు వెళుతున్నారు. వాళ్లు చెప్పినట్టు చేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా చేతబడులు చేస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో మనిషిబొమ్మతో చేతబడి చేయడం కలకలం రేపుతోంది.
Also read: కర్నాటకలో హత్య.. ఏపీలో మృతదేహం.. నింధితులను పట్టించిన డోర్ కర్టన్!
గ్రామంలోని పంటపొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొంతమంది మనిషిని పోలిన బొమ్మను తయారు చేసి పెట్టి, ఆ మనిషి ఆకారంలో నిమ్మకాయలు, పసుపు కుంకుమ వేశారు. అక్కడే జిల్లేడు చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అంతే కాకుండా గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో క్షుద్రపూజలు చేసినట్టు కనిపిస్తోంది. రాత్రి పూజలు చేయగా ఉదయం పొలానికి వెళ్లిన రైతు వాటిని గమనించి చుట్టుపక్కల రైతులకు సమాచారం అందించారు.
ఈ ఘటన గ్రామంలో కలకలం రేపడంతో పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో ఓ వ్యక్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఊరు బయట ఓ మాంత్రికుడితో చేతబడి చేయించినట్టు తెలిపారు. అలా చెప్పడంతో పంట పొలానికి చెందిన రైతు ఆందోళన చెందాడు. కోతకు వచ్చిన పంట కోసేందుకు హార్వెస్టర్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. గ్రామంలో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దని పెద్దమనుషులు ఆదేశించారు.