TTD Goshala Issue : తిరుమల గోశాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. గోవులు చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్ది రేపిన రచ్చ.. ఇప్పుడు వైసీపీ మెడకే చుట్టుకుంటోంది. జగన్ హయాంలో గోశాల కేంద్రంగా సాగిన దారుణాలు, అక్రమాలను బయటకు తీస్తున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. శనివారం గోసంరక్షణ శాలను సందర్శించారు. ఆయనతో పాటు టీటీడీ మాజీ గోసంరక్షణ సభ్యులు, గోరక్షక దళ్ వ్యవస్థాపకులు కోటి శ్రీధర్.. గోరక్షక దళ్ తెలంగాణ అధ్యక్షుడు కాలు సింగ్ తదితరులు ఉన్నారు.
గోవులను అమ్మేశారు.. రికార్డులు ఎత్తుకెళ్లారు..
వైసీపీ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్ముకున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు. గత ఐదేళ్లలో గోవుల గడ్డిని కూడా అక్రమంగా తినేశారని అన్నారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి దుర్మార్గుడని.. అతను చేసిన అక్రమాలు, అరాచకాలు చాలానే ఉన్నాయంటూ పలు సంచలన ఆరోపణలు చేశారు. హరినాథరెడ్డి బాగోతం బయటపడుతుందని.. గోశాలలో రికార్డులన్నీ అతను ఎత్తుకుపోయాడని అన్నారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు ఛైర్మన్.
గోశాలపై కమిటీ..
గోశాల వ్యవహారంపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామని చెప్పారు. గోశాలలో అసలేం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని అన్నారు. వైసీపీ చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.
వైసీపీ బెదిరింపులకు భయపడం..
పిల్ వేస్తామని టీటీడీని భయపెడుతున్నారని.. వైసీపీ నేతల బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరన్నారు ఛైర్మన్. గతంలో పింక్ డైమండ్‌పైనా ఇలానే అనవసర రార్థాంతం చేశారని ఫైర్ అయ్యారు.
Also Read : రూ. 2వేల కోట్లు.. ఏపీ ఎమ్మెల్యే భూములపై హైడ్రా వేటు
బీజేపీ నేతపై సీరియస్
బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. గత ఐదేళ్లలో గోశాలలో జరిగిన అన్యాయాలు ఆయనకు కనిపించలేదా? అని నిలదీశారు. వైసీపీపై పిల్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. టీటీడీ అంటేనే తెరమీదకు వచ్చే సుబ్రమణ్యస్వామి అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలపై అన్ని విషయాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.