HYDRA : హైడ్రా అతిపెద్ద ఆపరేషన్. ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడే స్పెషల్ డ్రైవ్. 17 ఎకరాల్లో కూల్చివేతలు. భారీగా పోలీస్ బలగాలు. ఉదయం నుంచి కొండాపూర్‌లోని హఫీజ్‌పేట్‌లో హైడ్రా సిబ్బంది హల్‌చల్ చేశారు. 17 ఎకరాల్లో ఉన్న భారీ నిర్మాణాలను కూల్చేశారు. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్‌లో జరుగుతుంటే.. ప్రకంపణలు మాత్రం ఏపీ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే.. ఆ భూములు టీడీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌వి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తులను హైడ్రా కూల్చివేయడం ఇదే ఫస్ట్ టైమ్. అందులోనూ ఏపీకి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యే భూముల్లో హైడ్రా బుల్డోజర్లు కదం తొక్కడం రాజకీయంగానూ ఉద్రిక్తత రాజేసినట్టవుతోంది.
అసలేం జరిగిందంటే..
హఫీజ్‌పేట్‌లో సర్వే నెంబర్ 79లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు 39 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలు రైల్వే లైన్ల కోసం పోగా.. మిగిలిన 34 ఎకరాలు ప్రస్తుతం ఆయన హ్యాండోవర్‌లో కొనసాగుతోంది. కొంత స్థలంలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు కట్టారు. అదంతా ప్రభుత్వ భూమి అని.. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా అంటోంది. ఆ భూముల్లోనే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. 17 ఎకరాల ఖాళీ స్థలంలో కోనేరు మురళీకృష్ణకు చెందిన KMK సంస్థ భారీ షెడ్డులు నిర్మించింది. వాటిల్లో సినిమా షూటింగులకు ఇచ్చే సామాగ్రి ఉంచారు. ఉదయమే హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి.. ఆ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. అందులో MLA వసంత కృష్ణప్రసాద్‌కు చెందిన ఆఫీస్ కూడా ఉంది. ఇక ఇప్పటికే కట్టేసి అమ్మేసిన విల్లాలు, అపార్ట్‌మెంట్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
వసంత వాదన ఇదే..
హైడ్రా కూల్చివేతలపై MLA వసంత కృష్ణప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూమిని తాను 2005లో కొనుగోలు చేశానన్నారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం తనకు నోటీసులు ఇస్తే.. రెగ్యులరైజేషన్ రుసుములు కట్టి.. 2006లో తన భూమిని క్రమబద్దీకరించుకున్నానని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకుని 20 ఏళ్లు అవుతోందని.. ఆ ల్యాండ్‌పై ఎలాంటి కేసులు కూడా లేవని అంటున్నారు.
సీఎం రేవంత్‌ను కలుస్తా..
ఇటీవల హైడ్రా నుంచి తనకు నోటీసులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తాను స్వయంగా హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను కలిసి తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, వివరాలు ఇచ్చానని చెబుతున్నారు. ఆ భూములు ‘పైగా’ వంశస్తులవని.. అయితే హైడ్రా మాత్రం ప్రభుత్వ భూములు అంటోందని అన్నారు. ఈ వివాదంపై గతంలో సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని.. అవి ప్రైవేట్ భూములేనని చెప్పిందని ఎమ్మెల్యే వసంత అంటున్నారు. అలాంటిది.. సడెన్‌గా ఉదయం హైడ్రా సిబ్బంది దాడి చేసి తన కార్యాలయాన్ని కూల్చేశారని.. అందులో విలువైన డ్యాక్యుమెంట్లు, రికార్డులు ఉన్నాయని.. కనీసం అవి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా విధ్వంసం చేశారని వాపోతున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలా కూల్చేయడం అన్యాయం, అక్రమం, దారుణం అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో లేనప్పుడు హైడ్రా ఇలా రెచ్చిపోవడమేంటని.. ముఖ్యమంత్రి ఉండుంటే తాను వెళ్లి కలిసేవాడినని అన్నారు. అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
Also Read : ఎమ్మెల్యే దానం నాగేందర్ మిస్సింగ్!!
హైడ్రా సీపీ రంగనాథ్ క్లారిటీ
హఫీజ్‌పేట్ సర్వే no 79/1 అనేది పూర్తి అక్రమం అంటున్నారు హైడ్రా సీపీ రంగనాథ్. ఆ 39 ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వానిదేనని.. కాపాడాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉందన్నారు. ఆ భూమి ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందని.. హైకోర్ట్ డివిజన్ బెంచ్‌లో కేసు నడుస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనను కలిశారని.. హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అని తేలిందని చెప్పారు. హైడ్రాకు ఎవరైనా సమానమే అని.. అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు హైడ్రా బాస్ రంగనాథ్.