TTD News: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కౌంటర్లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినప్పటికీ, ఇటువంటి ఘటన జరగడం తనను ఎంతగానో బాధించిందని చైర్మన్ అన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. వీరిలో రుయా వైద్యశాలలో 24 మంది, మిగిలిన వారు స్విమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట పై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఘటనకు సంబంధించి మీడియాతో చైర్మన్ మాట్లాడుతూ.. తనకు ముందు నుండే మనసులో కీడు శంకిస్తుందని, పలుమార్లు అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. జిల్లా ఎస్పీతో నేరుగా తాను మాట్లాడినట్లు, 5000 మంది పోలీసులను బందోబస్తు కోసం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారని చైర్మన్ అన్నారు. ఖచ్చితంగా టీటీడీ అధికారుల్లో లోపం ఉందని, అదే తొక్కిసలాటకు కారణంగా చైర్మన్ చెప్పడం విశేషం. అయితే ఈ ఘటనపై కుట్ర కోణం ఉందా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అలా ఎవరూ చేయరని ఇది కేవలం అకస్మాత్తుగా జరిగిన ఘటనగా ఛైర్మన్ అభిప్రాయ పడ్డారు.
తొక్కిసలాట మృతుల వివరాలు..
తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి వివరాలను పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రకటించారు. వైజాగ్ కు చెందిన రజిని (47) , శాంతి (40), నర్సీపట్నం కు చెందిన నాయుడు బాబు (51), సేలం కు చెందిన మల్లిక ( 49) , మరో మృతురాలు రాజేశ్వరి, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మృతి చెందినట్లు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Tirumala Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తులు మృతి.. అసలేం జరిగిందంటే?
టీటీడీ చైర్మన్ కు సీఎం చంద్రబాబు ఫోన్.. రేపు రాక..
తిరుపతిలో ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు నేరుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఫోన్ చేశారు. ప్రభుత్వం ముందు నుండే హెచ్చరించినప్పటికీ, భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్నట్లు చైర్మన్ తెలిపారు. మృతులకు ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియాను అందించడం పై సీఎం ప్రకటన చేస్తారని ఆయన అన్నారు.