చూసేందుకు ఓకే..
⦿ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ కుదరదు
⦿ కేటీఆర్ పక్కన లాయర్ ఉండేందుకు నో పర్మిషన్
⦿ ఆయన వెంట మాజీ అదనపు ఏజీ రామచంద్రరావు
⦿ లైబ్రరీ నుంచి అద్దాల ద్వారా చూసేలా ఏర్పాట్లు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Formula e Car Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించే ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్ వెంట లాయర్ కూడా హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చినా కేవలం చూడడానికి మాత్రమే పరిమితం కావాలని, వినడానికి కుదరదని తేల్చి చెప్పింది. విచారణ జరిగే రూమ్‌లో లాయర్ ఉండడానికి వీల్లేదని, మరో రూమ్‌లో ఉండి అద్దాల ద్వారా చూడడానికి మాత్రమే పరిమితం కావాలని సూచించింది.
ఏసీబీ అధికారుల ఎంక్వయిరీకి లాయర్‌ను అనుమతించాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. పై స్పష్టత ఇచ్చింది. లాయర్‌ను అనుమతించని కారణంగా ఈ నెల 6న విచారణకు హాజరుకాని కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసు జారీచేసి జనవరి 8న హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లాయర్ తన పక్కన ఉండేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగాపై క్లారిటీ వచ్చింది. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలన్న కేటీఆర్ రిక్వెస్టును హైకోర్టు తోసిపుచ్చింది.
కేటీఆర్ వెంట హాజరు కావాలనుకుంటున్న ముగ్గురు లాయర్ల పేర్లను ప్రతిపాదించాల్సిందిగా హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కోరగా న్యాయవాది అందజేశారు. వీరిలో గత ప్రభుత్వంలో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన జే రామచంద్రరావు పేరు ఖరారైంది. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగే ఎంక్వయిరీకి ఆయన హాజరుకానున్నారు.
కేటీఆర్ వెంట వచ్చే లాయర్ దూరంగా కూర్చుని చూడడానికి మాత్రమే పరిమితం కావాలని జస్టిస్ లక్ష్మణ్ అనుమతి మంజూరు చేయడంతో పాటు దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆరా తీసి ఆ ఏర్పాట్లు చేయాలని సూచించింది. న్యాయవాది లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని, అద్దాల ద్వారా చూడవచ్చని అదనపు అడ్వొకేట్ జనరల్ వివరించారు. న్యాయవాదితో కలిసి గురువారం ఏసీబీ విచారణకు వెళ్లాలని కేటీఆర్‌కు సూచించిన హైకోర్టు… విచారణ తర్వాత అనుమానాలుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.