Dos and Don’ts In Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి కరుణకటాక్షం ఉంటే చాలు.. సకల కోరికలు ప్రాప్తిరస్తు అంటారు వేద పండితులు. తిరుమలలో వెలసిన ఏడు కొండల స్వామి దర్శనార్థం అందుకే భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి భక్తులు, శ్రీవారి దర్శనం కోసం నిరంతరం వస్తారు. అందుకే తిరుమల మాడవీధులు ఎప్పుడు చూసినా గోవిందా నామస్మరణతో మారు మ్రోగుతుంటాయి. అయితే అసలు శ్రీవారి దర్శనం చేసుకొనే భక్తులు దర్శన ప్రక్రియ ఎక్కడి నుండి ప్రారంభించాలి? దర్శనం పూర్తి పరి సమాప్తం ఎప్పుడవుతుంది? అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.
సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా శ్రీ వరాహ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకొని తమ దర్శనం పరి సమాప్తంగా భావిస్తారు. కానీ వేద పండితులు తెలుపుతున్న వివరాల మేరకు.. తిరుమల శ్రీవారిని దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా తిరుపతికి చేరుకోవాలి. అక్కడ గల తీర్థకట్ట వీధి నుండి నడుచుకుంటూ వచ్చి, పూట గుళ్ళు వద్ద అవసరమైతే భోజనం స్వీకరించాలి. ఆ తర్వాత రాత్రి సమయం అయితే అక్కడే నిద్ర కూడా చేయవచ్చు. లేకుంటే నేరుగా కపిల తీర్థంకు చేరుకోవాలి. అక్కడ కపిలతీర్థం వద్ద గల పవిత్ర పావనమైన జలధార వద్ద స్నానమాచారించాలి. ఆ తర్వాత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఈ స్వామి వారిని దర్శించుకుంటే మహా పుణ్యమని వేదాలు చెబుతున్నాయి.
అలా కపిలేశ్వర స్వామిని దర్శించుకొని కాలినడకన వెళ్ళే వారు కాలినడకన, లేకుంటే వాహన మార్గంలో వెళ్లే వారు వాహనంలో కలియుగ వైకుంఠం వెలసిన తిరుమలకు చేరుకోవాలి. అక్కడ స్వామి వారికి తలనీలాలు సమర్పించాలని మొక్కు ఉంటే ముందుగా తలనీలాలు సమర్పించాలి. అనంతరం పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలి. అలా దర్శించుకున్న అనంతరం శ్రీవారి దర్శనభాగ్యం కోసం క్యూ లో ఉండి, నిశ్చలమైన భక్తితో గోవిందా నామస్మరణ చేయాలి.
అలా గోవిందా నామస్మరణ చేస్తూ, శ్రీవారిని దర్శించుకొని అక్కడి తీర్థాన్ని స్వీకరించాలి. అలా చివరగా శ్రీవారి ప్రసాదాన్ని మనం స్వీకరించిన అనంతరం మన శ్రీవారి దర్శనం పూర్తి పరిసమాప్తం అవుతుంది. అయితే అఖిలాండం వద్దకు కూడా కర్పూరం వెలిగించి, శ్రీవారికి కొబ్బరికాయలు కూడా సమర్పించవచ్చు. ఇలా శ్రీవారిని మీరు దర్శించారా లేదా.. లేకుంటే నెక్స్ట్ మీ దర్శనం ఇలా పూర్తి చేసుకోండి. అయితే చివరగా ఒక మాట.. గోవిందా నామస్మరణతో మన కష్టాలు తీర్చే స్వామి, నిశ్చలమైన భక్తితో కొలిస్తే చాలు.. ఆ స్వామి మన తప్పులను కూడా క్షణకాలంలో మన్నిస్తారు. కోరికలను కూడా తీరుస్తారు. అందుకే చివరగా మనస్పూర్తితో ఏడుకొండలవాడా.. వేంకటరమణా.. గోవిందా గోవిందా అందాం.. ఆ స్వామి దర్శనభాగ్యం నిరంతరం కలగాలని కోరుకుందాం.