టీటీడీ మాజీ ఈవో కరుణాకర్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుమలలో టీటీడీకి చెందిన గోశాలలో గోవులు చనిపోతున్నా పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. అక్కడ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, మూడు నెలలుగా గోవులు మరణిస్తున్నా.. ఆ సంగతి బయటపెట్టడం లేదన్నారు. కరుణాకర్ రెడ్డి ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.
బ్రేకింగ్ న్యూస్..
ఉదయం నుంచీ వైసీపీ సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావిడి జరిగింది. మధ్యాహ్నం 11 గంటలకు బ్రేకింగ్ న్యూస్ బయటపెడతామన్నారు. చివరకు కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ అన్నారు. అదే సమయంలో చనిపోయిన ఆవుల ఫొటోలను వైసీపీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి టీటీడీపై ఆరోపణలు సంధించారు. అమ్మకంటే పవిత్రంగా మనం గోవులను చూస్తామని, కానీ తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా ఆవులు మృతి చెందాయని, అయినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు కరుణాకర్ రెడ్డి. మూగజీవాలు దిక్కూమొక్కూ లేకుండా మరణిస్తున్నా పట్టించుకోవట్లేదని, కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదన్నారు. మూడు నెలల కాలంలో 100 ఆవులు మృతి చెందాయన్నారు.
https://twitter.com/YSRCParty/status/1910580592216887607
టీటీడీపై ఆరోపణలు..
వైసీపీ హయాంలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించామన్నారు కరుణాకర్ రెడ్డి. గతంలో వైఎస్ఆర్ హయాంలో వందే గో మాతరం అనే కార్యక్రమం చేపట్టామని, అయినా కూడా అప్పట్లో ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్మారని అన్నారాయన. తమ హయాంలో ఆవులను కాపాడుకున్నామని, కానీ ఇప్పుడు వాటి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గోవుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నేడు లేగదూడలను పట్టించుకునేవారు కూడా లేరని, కనీసం వాటికి మేత కూడా వేయట్లేదన్నారు. ఇటీవల తిరుమల టికెట్ల విషయంలో తొక్కిసలాట జరిగితే.. ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు కరుణాకర్ రెడ్డి. అప్పటి నుంచి గోశాలకు డైరెక్టర్ లేకుండా పోయారని, డీఎఫ్‌వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్ చార్జ్ గా నియమించారని.. అయినా పరిస్థితులు చక్కబడలేదన్నారు కరుణాకర్ రెడ్డి. తిరుమలలో గోశాల నేడు గోవధ శాలగా మారిపోయిందన్నారు కరుణాకర్ రెడ్డి. గోవుల మృతి విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారాయన. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారు. కరుణాకర్ రెడ్డి
టీటీడీ వివరణ..
కరుణాకర్ రెడ్డి ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా ఖండించింది టీటీడీ. ఎక్కడో మృతి చెందిన గోవుల ఫొటోలను తీసుకొచ్చి టీటీడీకి ఆపాదించడం సరికాదని వివరణ ఇచ్చింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తున్నారని టీటీడీ మండిపడింది. సోషల్ మీడియాతో పాటుగా మరికొందరు ఆరోపిస్తున్నట్లుగా గోవులు చనిపోలేదని టీటీడీ వివరణ ఇచ్చింది.
TTD strongly condemns the spread of false information intended to mislead devotees and the public.
We request the devotees not to believe false news . #FakeNews #TTDClarification #TTD #DontSpreadRumours #FactCheck pic.twitter.com/u0YciCHyv9
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) April 11, 2025
మరోవైపు టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. ధార్మిక క్షేత్రంలో దారుణాలంటూ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారాయన. ఆరోపణలు చేసిన వారు టైమ్ చెబితే.. గోశాలకు వచ్చి నిజానిజాలు తేల్చుకుందామని సవాల్ విసిరారు. కరుణాకర్ రెడ్డి చెప్పింది అసత్యం అని నిరూపిస్తామని, అదే జరిగితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. నీతులు చెప్పే స్థాయిలో వైసీపీ పార్టీ లేదని, వారి పాలనలో అనేక అపచారాలు ఆలయంలో జరిగాయని చెప్పారు. గోశాలలోని గోవులకు పుష్కలంగా ఆహారం అందిస్తున్నామని, అనారోగ్య కారణాలతో కొన్ని గోవులు మృతి చెందాయని వివరణ ఇచ్చారు.