సాక్షి ప్రసారాలు నిలిపివేయాలంటూ టీటీడీ తరపున చైర్మన్ బీఆర్ నాయుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు, తప్పుడు వార్తలకు క్షమాపణలు చెప్పాలంటూ సాక్షి యాజమాన్యంపై రూ.10కోట్లకు పరువునష్టం దావా వేశారు. అయితే సాక్షి తగ్గేది లేదంటోంది. తాడోపేడో తేల్చుకుంటామంటూ మరింత రెచ్చగొట్టేలా వార్తలిస్తోంది. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు, ఎవరు సైలెంట్ అవుతారు, వేచి చూడాలి.
టీటీడీ వాదన ఏంటి..?
తిరుమల తిరుపతి దేవస్థానంపై సాక్షి మీడియాలో ఇటీవల అసత్య ప్రచారం జరుగుతోందంటూ మండిపడ్డారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తాను టీటీడీ చైర్మన్ గా పదవి చేపట్టిన తర్వాత మరింత ఎక్కువగా తప్పుడు వార్తలిస్తున్నారని, తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగే వార్తలిచ్చారని ఆయన అన్నారు. సాక్షి మీడియా హిందూ మతం మీద దాడి చేస్తోందని ధ్వజమెత్తారాయన. ఈ విషయంలో సాక్షి మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు తాను వెనక్కి తగ్గబోనన్నారు. సాక్షి మీడియాపై ఆయన పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆయన తన లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా వెంటనే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీకి సాక్షి మీడియా రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
తలనీలాలు సమర్పించారా? ప్రసాదం తిన్నారా..?
అసలు జగన్, ఆయన సతీమణి భారతి.. ఎప్పుడైనా తిరుమలకు వచ్చి శ్రీవారికి తలనీలాలు సమర్పించారా అని ప్రశ్నించారు బీఆర్ నాయుడు. వారు అసలు వేంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్నారా..? అని అడిగారు. హిందూ ధర్మం అంటే జగన్ కి పడదని, అందుకే తప్పుడు వార్తలతో నిందలు వేస్తున్నారని, తమపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని అడిగారు. ఎవరితో అయినా పెట్టుకోండి, తనతో పెట్టుకోవద్దని ఘాటుగా హెచ్చరించారు. వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి అవినీతి సామ్రాట్ అని అన్నారు. ఆయన హయాంలో రూ.1600 వందల కోట్ల మేర పనులను టెండర్లకు ఇచ్చి 10 శాతం పర్సెంటేజ్ తీసుకున్నారని ఆరోపించారు.
పరువు నష్టం దావాపై సాక్షి స్పందన..
టీటీడీ లీగల్ నోటీసులపై సాక్షి కూడా ఘాటుగానే స్పందించింది. లీగల్ నోటీసుల ఉడత ఊపులకు తాము భయపడేది లేదని చెప్పింది. తిరుమలలో అరాచకాలు జరుగుతున్నాయని, వాటిపై తమ పోరాటం ఆగదని సాక్షి స్పష్టం చేసింది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారనేది నిజం కాదా అని సాక్షి ప్రశ్నించింది. ఆ సమయంలో క్షమాపణ చెబితే చనిపోయిన వారు బతికొస్తారా? అంటూ టీటీడీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా అని సాక్షి ప్రశ్నించింది. వారి చేతగానితనంలో సామాన్యులు కొండపై ఇబ్బందులు పడుతున్నారని, ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చెప్పినా టీటీడీ అదే ప్రయత్నం చేయడాన్ని ఎలా చూడాలన్నది.
ఏం జరుగుతుంది?
పరువు నష్టం దావా విషయంలో టీటీడీ సీరియస్ గానే ఉంది. అయితే ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారంటూ సాక్షి మీడియా సింపతీకోసం చూసే అవకాశం ఉంది. గతంలో సాక్షి జర్నలిస్ట్ అరెస్ట్ సమయంలో కూడా ఇలానే రాజకీయ రగడ జరిగింది. ఇప్పుడు కూడా ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకొంది. చివరికి ఎవరు నెగ్గుతారో, ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.