Tirumala News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి సంధర్భంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన సౌకర్యాన్ని పది రోజులు టీటీడీ, భక్తులకు కల్పించింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో శుక్రవారం వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు.
ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికి ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు. పూజాది కైంకర్యాలు ముగిసిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు. అలాగే ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. అంతేకాకుండ శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై ఆలయ తిరు విధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవ మూర్తులు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
కాగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గోవింద నామస్మరణ సాగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అలిపిరి కాలినడక మార్గం నుండి సైతం భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శన భాగ్యం కోసం వేచి ఉన్నారు. సుమారుగా 70 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు పొందగా, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలలో సైతం వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు ఆయా జిల్లాలలో కల్పించారు.
Horoscope Today January 10th: ఆ రాశి వారికి ఈరోజు స్త్రీ వల్ల ధనలాభం ఉంది
ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేటి నుండి జనవరి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.