Indian Railways: భారతీయ రైల్వే సంస్థ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోజు రోజుకు మరింత పురోగతి సాధిస్తున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు తమ సర్వీసులను అందిస్తున్నాయి. ఎక్కువ వేగం, అధునిక సౌకర్యాలతో ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతున్నాయి. త్వరలోనే 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు బుల్లెట్ రైళ్లపైనా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దేశంలో 2026 నాటికి బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నది. ముంబై- అహ్మదాబాద్ నడుమ హైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. 508 కిలో మీటర్ల మేర ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
కాలుష్య రహిత ప్రయాణం దిశగా అడుగులు
కాలుష్య రహిత రైల్వే వ్యవస్థను రూపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ రైలు పర్యావరణ అనుకూల ప్రయాణంలో కొత్త మైల్ స్టోన్ గా నిలువబోతోంది. దేశ వ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే హైడ్రోజన్ ప్యూయల్ సెల్స్, సపోర్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ల ఇన్ స్టాలేషన్ మొదలయ్యింది. హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల డిజైన్లు ఇప్పడికే ఆమోదించబడ్డాయి. ఒక్కో హైడ్రోజన్ రైలు అంచనా వ్యయం రూ. 80 కోట్ల వరకు ఉంటుందని రైల్వే సంస్థ వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యాధునిక హైడ్రోజన్ రైలు ఇంజిన్ తయారీ
ఇక భారత్ లో పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు పూర్తి స్థాయి స్వదేశీ టెక్నాలజీతో రూపొందుతున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భువనేశ్వర్ లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొన్న ఆయన.. హైడ్రోజన్ రైలుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచంలో ప్రస్తుతం తయారవుతున్న హైడ్రోజన్ రైలు ఇంజిన్లతో పోల్చితే భారత హైడ్రోజన్ రైలు ఇంజిన్ అత్యంత పవర్ ఫుల్ గా ఉండబోతుందన్నారు. “ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దేశాలు హైడ్రోజన్ రైలు ఇంజిన్లను తయారు చేస్తున్నాయి. వాటి సామర్థ్యం 500 నుంచి 600 HP ఉంటుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మనం తయారు చేస్తున్న హైడ్రోజన్ రైల్వే ఇంజిన్లు చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి. ఒక్కో ఇంజిన్ 1,200 HP సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఇంత సామర్ధ్యంతో ఎక్కడా హైడ్రోజన్ ఇంజిన్లు తయారు కావడం లేదు. త్వరలో హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో ఈ రైలు ట్రయల్ రన్ కొనసాగనుంది. హైడ్రోజన్ ఇంజిన్ తయారీ టెక్నాలజీని ఉపయోగించుకుని పవర్ ఫుల్ ట్రక్కులు, టగ్ బోట్లను కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
🚆 Bharat’s Hydrogen train – 1200 HP capacity.
Developed by our engineers, our talent. pic.twitter.com/X5YMO0zHdz
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 9, 2025
తొలి హైడ్రోజన్ రైలు పరుగులు తీసేది ఎక్కడంటే?
భారత్ లో అందుబాటులోకి వచ్చే తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలో తన సేవలను అందించనుంది. జింద్-సోనిపట్ పరిధిలోని 90 కిలో మీటర్ల పరిధిలో ఈ రైలు నడవనుంది. పలు పర్యాటక ప్రదేశాల్లోనూ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాని అధికారులు భావిస్తున్నారు.
Read Also: ఈ రైళ్లలో విదేశాలకు కూడా వెళ్లిపోవచ్చు, ఎక్కడో కాదు ఇండియాలోనే!