Bigg Boss Priyanka Jain: బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకపై క్రిమినల్ కేసు నమోదు కానుందా.. అలాగే ఆమె ప్రియుడికి కూడా చిక్కులు తప్పవా.. అంటే అవుననే అంటున్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. తాజాగా తిరుమలకు వెళ్లే నడకడారిలో ప్రియాంక, తన లవర్ తో కలిసి ప్రాంక్ వీడియో చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, టీటీడీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని సమాచారం.
అలిపిరి నుండి కాలినడక వెళ్లే మార్గంలో గల 7వ మైలు రాయి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్య గల దారిలో ప్రియాంక ప్రాంక్ వీడియో చేశారు. గతంలో ఇదే ప్రదేశం వద్ద చిరుతపులి దాడి చేయగా, బాలిక మృతి చెందింది. అయితే ప్రియాంక అదే ప్రదేశంలో వేరే జంతువును చూపించి, పులి అంటూ కేకలు వేసింది. దీనితో ఆ దారిలో తిరుమలకు నడక దారిలో వెళుతున్న భక్తులు భయాందోళన చెందారు.
ఈ వీడియో కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి, ప్రియాంక తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయగా నెటిజన్స్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఉదయం నుండి పలు మాధ్యమాలలో ఈ విషయం వైరల్ కాగా, బిగ్ టీవీతో టీటీడీ పాలకమండల సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే భక్తులు తిరుమల పవిత్రతను కాపాడడంలో ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధానంగా సెలబ్రిటీలు తిరుమలకు వచ్చే సమయంలో ఇటీవల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారన్నారు. గతంలో చిరుత పులి దాడి చేసి పాప మృతి చెందిన ప్రదేశం వద్ద, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ప్రాంక్ వీడియోలు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసేలా తాను టీటీడీ అధికారులతో మాట్లాడినట్లు, ఎట్టి పరిస్థితుల్లో ప్రియాంకపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఖాయమని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఏవైనా భక్తిపరమైన రీల్స్ చేసినా ఆమోదయోగ్యంగా ఉంటుందని, ఇటువంటి పిచ్చిపిచ్చి చేష్టలు చేసి సెలబ్రిటీలు తమ హోదాను తగ్గించుకోవద్దని ఆయన సీరియస్ అయ్యారు. ప్రియాంకపై నమోదు చేసే కేసు ఇతరులకు గుణపాఠంగా మారాలని, మరో మారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో దివ్వెల మాధురి, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటువంటి పిచ్చి వేషాలు వేశారని, ఇలాంటి చర్యలు మరో మారు జరగకుండా, చట్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు తాను కృషి చేయనున్నట్లు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు.