Tirumala Updates: అసలే కార్తీకమాసం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 52,643 మంది భక్తులు దర్శించుకోగా.. 24,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.73 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read: Horoscope November 8th: ఈ రోజు మేష రాశి నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుందంటే..
15వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 15వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.