Tirumala: తిరుమలలో దర్శనాలన్నీ రద్దు కానున్నాయి. ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు తప్ప మిగతా దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అసలు దర్శనాలు ఎందుకు రద్దు చేస్తున్నారు..? ఎప్పడు రద్దు చేస్తున్నారు లాంటి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి అన్ని రకాల దర్శనాలు ఈ నెలలోనే మూడు రోజుల పాటు రద్దు కానున్నాయి. స్వయంగా ఆలయ అధికారులే ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు తప్ప మరెలాంటి దర్శనాలు కూడా ఆ మూడు రోజులు ఉండవని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆ మూడు రోజులు ఎలాంటి సిఫార్స్ లేఖలు కూడా స్వీకరించబోమని అధికారులు తెలియజేశారు. ఆ మూడు రోజులకు ఉన్న ప్రత్యేకత ఏంటి..? ఎందుకు శ్రీవారి దర్శనాలు రద్దు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెల 25వ తేదీన రథసస్తమి రానుంది. అందుకోసం తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లు విభిన్నంగా చేసి విజయవంతంగా ముక్కోటి ఏకాదశి దర్శనాలను పూర్తి చేశారు. అదే విధంగా ఇప్పుడు రథసప్తమికి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 24, 25, 26 తేదీలలో ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు తప్ప మిగతా అన్ని దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు.
ఇక ఈ మూడు రోజులు జరిగే సేవల వివరాలను తెలియజేశారు ఆలయ అధికారులు. తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) సూర్యప్రభ వాహనం ఉంటుందని అలాగే.. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయని తెలిపారు.
శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఈ మూడు రోజులు రద్దు చేయబడ్డాయి. అందులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా ఉన్నాయి. ఇక ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శనం. దివ్యదర్శనం టోకెన్లు జారీ కూడా ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ మరియు సోషల్ మీడియాలో ప్రచారం ఇతర ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు.