SV Anna Prasadam Trust TTD: అసలే కార్తీకమాసం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.
ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 59,231 మంది భక్తులు దర్శించుకోగా.. 22,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.08 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే శ్రీవారి దర్శనానికై 9 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్ ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ ను కెనరా బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళం అందిచవచ్చు.
Also Read: Tirumala News: లైసెన్స్ ఒక్కటే.. దుకాణాలు మూడు.. తిరుమలలో అసలు వ్యాపారమిదే.. దోపిడి కూడా?
రూ.1 నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని భక్తులు కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీని పూర్తిగా డిజటలైజేషన్ చేయడంలో భాగంగా ఈ మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, కెనరా బ్యాంకు డీజీఎం రవీంద్ర అగర్వాల్, ఏజీఎం నాగరాజు రావు, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవన్, తదితరులు పాల్గొన్నారు.