Tirumala News: తిరుమలలో వ్యాపారాల పేరుతో సాగుతున్న మోసంపై టీటీడీ దృష్టి సారించింది. గోవిందా నామస్మరణ చేస్తూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అధికం. అందుకే ఇక్కడ వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు చేస్తున్న మోసాన్ని టీటీడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ బట్టబయలు చేస్తున్నారు.
కలియుగ వైకుంఠం కొలువైన శ్రీ శ్రీనివాసుడు వెలసిన క్షేత్రం తిరుమల. స్వామి వారిని దర్శించి మన కోరికలు అలా మొక్కుకుంటే.. ఇలా తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. అంతటి మహిమలు గల ఆలయం వెలసిన తిరుమల క్షేత్రంకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా.. దేశ, విదేశాల నుండి కూడా వస్తుంటారు. అందుకే తిరుమల మాడవీధులు నిరంతరం భక్తజనంతో నిండి ఉంటాయి.
భక్తుల గోవింద నామస్మరణతో తిరువీధులు ఎప్పుడూ ధ్వనిస్తుంటాయి. తిరుమల శ్రీవారి దర్శనంకై అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం నుండి కూడా భక్తులు చేరుకుంటారు. ఇలా ప్రతిరోజూ 50 వేల నుండి 90 వేల వరకు భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇలా భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో టీటీడీ పలువురికి వ్యాపారాలు నిర్వహించేందుకు లైసెన్సులు మంజూరు చేసింది.
తాజాగా టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టాక, టీటీడీ అధికారులు అసలు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి లైసెన్సులు ఉన్నాయా.. అవినీతి జరుగుతోందా అంటూ వాకబు చేశారు. ఇక్కడే అధికారులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇటీవల తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేసిన అడిషనల్ ఈవో మాట్లాడుతూ.. తిరుమలలో ఒకే లైసెన్సుతో రెండు, మూడు ప్రాంతాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లైసెన్స్ లను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా డిజిటలైజేషన్ చేస్తే మాత్రం, ఇన్నాళ్లు లైసెన్స్ లు కూడా లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్థులకు కూడా ఇక శుభం కార్డు పడుతుందన్నది టీటీడీ ఆలోచన.
Also Read: AP Students: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 30వతేదీ వరకే గడువు.. మీరు అప్లై చేశారా!
పవిత్రమైన తిరుమలలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్తులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి వారి దర్శనానికి వస్తే, అక్కడి కొందరి వ్యాపారుల నిర్వాకం మాత్రం జేబులు ఖాళీ చేసే తీరులా ఉందని పలువురు భక్తులు తెలుపుతున్నారు. ఇలా లైసెన్స్ లేని వ్యాపారస్తులను గుర్తించడమే కాక, ధరల విషయంలో కూడా టీటీడీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.