వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ ఏడాది ఫిబ్రవరి 13నుంచి జైలులోనే ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి.. ఆయన్ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఆ కేసులో బెయిలొస్తే, ఈ కేసులో జైలు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎట్టకేలకు ఆయన నిరీక్షణకు తెరపడిందనే అనుకోవాలి. ఆ సమయం రానే వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు కృష్ణాజిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈసారైనా గ్యారెంటీనా..?
వల్లభనేని వంశీ బెయిల్ వ్యవహారం చాన్నాళ్లుగా వార్తల్లో ఉంది. అదిగో బెయిల్, ఇదిగో బయటకు వస్తున్నారంటూ వార్తలొచ్చినా ఆయన విడుదల మాత్రం సాధ్యం కావడం లేదు. ఒక కేసులో బెయిలొచ్చే లోపు ఇంకో కేసులో ఆయనకు రిమాండ్ పడుతోంది. ఇప్పటికే ఆయనపై చాలా కేసులున్నాయి. 2019 ఎలక్షన్ టైమ్ లో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు తాజాగా ఆయన్ను ఇబ్బంది పెడుతోంది. ఈ కేసులో ఈరోజు ఆయనకు బెయిలొచ్చింది. నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల ఖాయమైందని అంటున్నారు. ఇప్పటి వరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. తాజాగా నకిలీ ఇళ్లపట్టాల కేసులో కూడా బెయిల్ రావడంతో వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం దొరికింది.
ఇటీవలే మరో బెయిల్..
ఇటీవలే గనుల అక్రమ తవ్వకాల కేసులో కూడా ఆయనకు బెయిల్ లభించింది. గనుల అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలుగజేశారంటూ ఆయనపై కృష్ణాజిల్లాలో కేసు నమోదైంది. గనులశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు, కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఆయన బెయిల్ కి అప్లై చేశారు. వెకేషన్ కోర్టులో ఆయనకు బెయిల్ లభించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం తేలాల్సి ఉంది. ఇంతలోనే చివరి కేసులో కూడా ఆయనకు బెయిల్ రావడంతో విడుదలకు మార్గం దొరికినట్టయింది.
వరుస కేసులు..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ ముద్దాయి. అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారుడైన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఆయన తప్పుమీద తప్పుచేసినట్టయింది. అసలు కేసులో ఆయనకు బెయిల్ లభించినా.. సత్యవర్థన్ ని కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ వేధింపుల సెక్షన్లు కూడా పెట్టడంతో వంశీ అడ్డంగా బుక్కయ్యారు. ఆ తర్వాత వరుస కేసులు ఆయన్ను చుట్టుముట్టాయి. గన్నవరం నియోజకవర్గంలో ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం, గనుల అక్రమ తవ్వకం వంటి కేసుల్లో వంశీకి రిమాండ్ విధించింది కోర్టు. ఆ కేసులన్నిట్లో ఆయనకు విడివిడిగా బెయిల్ వచ్చింది. చివరిగా నకిలీ ఇళ్లపట్టాల కేసులో నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. విపరీతంగా ఆయన బరువు కోల్పోయారని అంటున్నారు. ఈ దశలో బెయిల్ రాకపోతే ఆయన ఆరోగ్య సమస్యలు మరింత పెద్దవయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ దశలో వంశీకి బెయిల్ రావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.